PM Surya Ghar Muft Bijli Yojana: దేశంలోని కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల కరెంట్ ఫ్రీ..

PM Surya Ghar Muft Bijli Yojana: దేశంలోని కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల కరెంట్ ఫ్రీ..
రూ.75 వేల కోట్లతో కేంద్రం ఆమోదం

లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ప్రధానమంత్రి "సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు"కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 75 వేల కోట్ల వ్యయంతో తీసుకురానున్న ఈ పథకం కింద కోటి కుటుంబాలు 300యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పొందుతాయని కేబినెట్ భేటీ తర్వాత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో భాగంగా 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ భవనాలపై ప్రాధాన్య ప్రాతిపదికన రూఫ్‌టాప్ సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి కుటుంబం.. ఒక కిలోవాట్ సోలార్ ప్యానెళ్ల వ్యవస్థకు 30 వేలు, రెండు కిలోవాట్‌లకు 60 వేలు, మూడు కిలోవాట్ సిస్టమ్‌కు 78 వేల వరకు సబ్సిడీ పొందవచ్చని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఇదే సమయంలో లక్షా 26 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో గుజరాత్, అసోంలలో మూడు సెమీకండక్టర్ యూనిట్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.వచ్చే వంద రోజుల్లో ఈ మూడుయూనిట్ల నిర్మాణం ప్రారంభిస్తామని

టెలికంశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తైవాన్‌కు చెందినPSMC సంస్థతో కలిసి టాటా ఎలక్ర్టానిక్స్..91 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో సెమీకండక్టర్ ఫ్యాబ్‌ యూనిట్‌ను గుజరాత్‌లోని ధోలేరాలో ఏర్పాటు చేయనుంది. అసోం మోరిగావ్‌లో 27 వేల కోట్ల పెట్టుబడితో టాటా సంస్థ మరో సెమీకండక్టర్ యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. జపాన్‌కు చెందిన రెనేసాస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ , థాయ్‌లాండ్‌లోని స్టార్స్ మైక్రోఎలక్ట్రానిక్స్ భాగస్వామ్యంతో CG పవర్ 7 వేల 600 కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లోని సానంద్‌లో సెమీకండక్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. మరోవైపు ఖరీఫ్ సీజన్‌కు ఫాస్ఫేటిక్, పొటాసిక్ -P అండ్ K ఎరువులపై 24 వేల420 కోట్ల సబ్సిడీని కేంద్రం ప్రకటించింది. రైతులకు కీలకమైన DAP క్వింటాల్‌కు వెయ్యి 350 రూపాయలకు అందనుంది. పులులు వాటి ఇతర జాతుల సంరక్షణ కోసం గ్లోబల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ -IBCAఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story