Ahmedabad Plane Crash: అవసరమైతే ఎవరినైనా విచారిస్తాం.. విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో

Ahmedabad Plane Crash: అవసరమైతే ఎవరినైనా విచారిస్తాం.. విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో
X
తాజాగా పైలట్ మేనల్లుడికి దర్యాప్తు సంస్థ సమన్లు

అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగి 7 నెలలు గడుస్తున్నా కారణమేంటో తెలియలేదు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. అయితే దర్యాప్తులో భాగంగా తాజాగా పైలట్ సుమిత్‌ సభర్వాల్‌ మేనల్లుడు వరుణ్‌ ఆనంద్‌కు విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (AAIB) సమన్లు జారీ చేసింది. తమ ఎదుట హాజరు కావాలని సమన్లు అందజేసింది. అయితే ఈ సమన్లపై పైలట్ సంఘాలు మండిపడ్డాయి. వేధించేందుకే ఈ సమన్లు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఏఏబీఐకి లీగల్ నోటీసులు పంపించింది.

పైలట్ సంఘాల అభ్యంతరంపై ఏఏఐబీ అధికారులు స్పందించారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు విషయంలో తాము చట్టప్రకారంగానే వ్యవహరించామని… ప్రమాదంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్న సమయంలో వాస్తవాలను తెలుసుకోవడానికి అన్ని విషయాలపైనా దృష్టిపెట్టాల్సి ఉంటుందన్నారు. అందుకు ఎవరినైనా విచారించే అధికారం తమకు ఉందని స్పష్టం చేశారు. దర్యాప్తునకు ఉపయోగపడతారని అనిపిస్తే ఎవరినైనా.. ఎన్నిసార్లు అయినా పిలుస్తామని తేల్చి చెప్పింది. విచారణకు పిలిచినంత మాత్రానా వేధించడం కోసం కాదని స్పష్టం చేసింది.

వరుణ్‌ ఆనంద్‌ కూడా ఎయిరిండియాలో పైలట్‌గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా భారత పైలట్ల సమాఖ్యలో సభ్యుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో వరుణ్ ఆనంద్‌కు నోటీసులు ఇవ్వడమేంటి? అని ప్రశ్నిస్తోంది. ఏఏఐబీ నోటీసులను పూర్తి అనవసరమైన చర్యగా పేర్కొంది. అహ్మదాబాద్ ప్రమాదంతో ఎలాంటి సంబంధం లేని వరుణ్ ఆనంద్‌ను పిలవడమేంటి? అని నిలదీసింది. ‘‘ఇది వేధింపులకు పాల్పడటం, మానసిక క్షోభకు గురిచేయడమే అవుతుంది. ఆయన వృత్తిపరమైన, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది’’ అని పైలట్ల సమాఖ్య పేర్కొంది.

జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. హాస్టల్‌లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే ప్రమాదం జరిగిన కొన్ని రోజులకు ప్రాథమిక రిపోర్టు వచ్చింది. ఈ రిపోర్ట్‌పై అంతర్జాతీయ మీడియా అనేక కథనాలు ప్రసారం చేశాయి. పైలట్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లుగా పేర్కొన్నాయి. ఈ కథనాలపై కూడా పైలట్ సంఘాలు మండిపడ్డాయి.

Tags

Next Story