Vice President: ఉప రాష్ట్రపతి అభ్యర్ధిపై కొనసాగుతున్న సస్పెన్స్‌..

Vice President: ఉప రాష్ట్రపతి అభ్యర్ధిపై కొనసాగుతున్న సస్పెన్స్‌..
Vice President: రాష్ట్రపతి రేసులో అభ్యర్ధులు, ప్రత్యర్థులు, బలాబలాలు తేలిపోయాయి.

Vice President: రాష్ట్రపతి రేసులో అభ్యర్ధులు, ప్రత్యర్థులు, బలాబలాలు తేలిపోయాయి. ఇక ఉప రాష్ట్రపతి పదవికి అభ్యర్ధులు ఎవరో తేలాల్సి ఉంది. ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాకపోతే, అభ్యర్ధి పేరును ఇవాళ కాకుండా ఢిల్లీలో ప్రకటించొచ్చని తెలుస్తోంది. అభ్యర్థి ఎవరో ముందే చెబితే.. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు పోటీ పెట్టేవాళ్లమే కాదని సీఎం మమతా బెనర్జీ కామెంట్ చేశారు. ముందుగా ఒక్కమాట చెప్పి ఉంటే.. ఆమెకు మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలించేవాళ్లమని చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో బీజేపీ ముందుగానే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. విపక్షాలు ఎవరిని నిలబెడతున్నాయన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పటి వరకు ఒక్క అభ్యర్ధి పేరు కూడా బయటకు రాలేదు. కాని, ఎన్డీయే కూటమి నుంచి ముగ్గురు నలుగురు పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్ సింగ్. ఎన్డీయే తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్‌ సింగ్ పేరు రావడం అనూహ్యమే. 80 ఏళ్ల అమరీందర్ సింగ్‌.. వెన్నెముక ఆపరేషన్‌ కోసం ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు.

కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చేసిన అమరీందర్‌సింగ్‌.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. అయితే, లండన్‌ నుంచి తిరిగి వచ్చాక.. పార్టీని బీజేపీలో విలీనం చేసి ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తారన్న అంచనాలున్నాయి. లండన్‌కు వెళ్లే ముందే తన పార్టీని బీజేపీలో విలీనం చేసే ఉద్దేశం ఉందని అమరీందర్‌ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి అభ్యర్ధిగా గిరిజన మహిళను నిలబెట్టడంతో.. ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా మైనార్టీ లేదా ఎస్సీ వర్గానికి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ముఖ్తార్ అబ్బాస్‌కు అవకాశం ఇవ్వొచ్చు.

ఈసారి నఖ్వీకి రాజ్యసభ ఎంపీ పదవిని బీజేపీ అధిష్టానం రెన్యువల్ చేయలేదు. దీంతో ఉప రాష్ట్రపతిగా నఖ్వీని నిలబెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. ఒకవేళ సమీకరణాలు మారితే కర్నాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ పేరును ప్రకటించే అవకాశాలున్నాయి. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కర్నాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ పేరు కూడా వినిపిస్తోంది.

దళితుడు కావడంతో విపక్షాలు పోటీగా అభ్యర్ధిని నిలబెట్టకపోవచ్చన్న అంచనాలో అధికారపక్షం ఉంది. మధ్యప్రదేశ్‌కు చెందిన థావర్‌చంద్‌ గెహ్లాట్‌.. కర్నాటక గవర్నర్‌ కంటే ముందు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. విపక్షాలు గనక దక్షిణాది వ్యక్తిని ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలబెట్టే ఆలోచన ఉంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో వెంకయ్య నాయుడునే మరోసారి ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీకి దింపుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story