డ్యాన్స్‌ చేయలేదని చితకబాదిన టీచర్‌

డ్యాన్స్‌ చేయలేదని చితకబాదిన టీచర్‌
రిసార్ట్‌లో డ్యాన్స్‌ చేయనందుకు 13 ఏళ్ల గిరిజన విద్యార్థినిపై పాఠశాల ఉపాధ్యాయురాలు కర్రతో విచక్షణారహితంగా కొట్టింది

మహారాష్ట్రలోని నాసిక్‌లో దారుణం చోటు చేసుకుంది. రిసార్ట్‌లో డ్యాన్స్‌ చేయనందుకు 13 ఏళ్ల గిరిజన విద్యార్థినిని పాఠశాల ఉపాధ్యాయురాలు కర్రతో విచక్షణారహితంగా కొట్టింది. దీంతో ఆ బాలిక తండ్రికి విషయం చెప్పడంతో పాఠశాల యజమాన్యం, ఉపాధ్యాయురాలిపై కేసు నమోదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. నాసిక్‌ జిల్లా త్రయంభకేశ్వర్‌ తాలుకలోని సర్వహర పరివర్తన్‌ కేంద్ర ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో 13 ఏళ్ల బాలిక 7వ తరగతి చదువుతోంది. స్కూల్లో హాస్టల్‌ వసతి కూడా ఉంటుంది. అయితే ఆ పాఠశాల యజమాన్యానికి రిసార్ట్‌ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడికి టూరిస్టులు కూడా వస్తుంటారు.

వారి కోసం 400 నుంచి 500 మంది టూరిస్టులతో ఓ వేడుకను ప్లాన్‌ చేశారు. దీంతో అక్కడ డ్యాన్స్‌ చేసేందుకు సదరు గిరిజన విద్యార్థినిని అలాగే తనతో పాటు చదువుకునే విద్యార్థినిలను కూడా డ్యాన్స్‌ చేయమని ఓ మహిళా టీచర్‌ అడిగింది. అందుకు బాలిక నిరాకరించింది. దాంతో కోపోద్రిక్తురాలైన టీచర్‌ సదరు బాలికను కర్రతో కొట్టింది. జూన్‌ 14 న ఆ బాలిక తన తండ్రికి ఫోన్‌ చేసి జరిగిన సంఘటన చెప్పింది.

వెంటనే అక్కడికి వచ్చిన తండ్రి పాఠశాల యజమానిపై, మహిళా టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఈ కేసులో ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు. ఈ ఘటనపై స్థానిక సామాజిక కార్యకర్త స్టేట్‌ ట్రైబల్‌ కమీషనర్‌కు ఫిర్యాదు చేశాడు. అలాగే ఆ పాఠశాల యాజమాన్యం ఎండాకాలం సెలవలు పూర్తి కాక ముందు విద్యార్థినులను పాఠశాలకు రప్పించారని వారితో రిసార్ట్‌లో డ్యాన్స్‌ చేయించాలని ఒత్తిడి చేశారని తెలిపారు. జూన్‌ 18న బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పిల్లల సంరక్షణ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story