Rahul Gandhi: దేశం గురించి నిజం చెబితే... విభజించినట్లు అవుతుందా?: రాహుల్

దేశంలో కుల వ్యవస్థ.. కుల వివక్ష ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తెలిపారు. కుల వివక్ష ఉందని అంగీకరించి దానిని నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. నేను దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నానని ఆరోపిస్తున్నారు. దేశంలో ఉన్న వాస్తవం.. నిజం చెబితే దేశాన్ని విభజించడమా?' అని ప్రధాని మోదీని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
హైదరాబాద్‌లోని బోయినపల్లి గాంధీ తత్వ చింతన కేంద్రంలో కులగణనపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కులగణన ద్వారా దళితులు, ఓబీసీలు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుందన్నారు. కులగణన ద్వారా ఎవరి వద్ద ఎంత ఆస్తులు ఉన్నాయో తేలిపోతుందని పేర్కొన్నారు.
కులగణన చేస్తామని తాను పార్లమెంట్ సాక్షిగా చెప్పానని గుర్తు చేశారు. తెలంగాణలో కులగణన చేపట్టడం అభినందనీయమని రాహుల్ గాంధీ అన్నారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కులగణన చేసి... జనాభాకు తగినట్లుగా రిజర్వేషన్లను పెంచుతామని వెల్లడించారు. రిజర్వేషన్ల పరిమితిని తొలగిస్తామన్నారు. కులగణనను వ్యతిరేకించే వారు ప్రజల నుంచి వాస్తవాలను దాచాలని చూస్తున్నారని విమర్శించారు.
కులగణన సందర్భంగా ఏ ప్రశ్నలు అడగాలనేది సామాన్యులే నిర్ణయించాలన్నారు. ఆ ప్రశ్నలను అధికారులు నిర్ణయించకూడదన్నారు. కులవివక్ష, కులవ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు కూడా ఎక్కువగానే ఉంటాయన్నారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే కుల వివక్ష ఉండకూడదన్నారు. కులగణనలో ఏవైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. మన దేశంలో కుల వ్యవస్థ బలంగా ఉందని.. అగ్రకులాలకు ఎప్పుడూ కుల వ్యవస్థ కనిపించదని రాహుల్ గాంధీ తెలిపారు. కుల గణన ద్వారా బడుగు బలహీనవర్గాలకు నష్టం జరగకుండా చూడవచ్చని చెప్పారు. అన్ని రంగాల్లో కుల వ్యవస్థ ఉందని.. రాజకీయ, న్యాయ వ్యవస్థల్లో.. ప్రైవేటు రంగంలోనూ కూడా కుల వ్యవస్థ ఉందని వివరించారు. ఆత్మ విశ్వాసాన్ని కుల వ్యవస్థ దెబ్బతీస్తుందన్నారు. కుల గణనకు తెలంగాణనే దేశానికి రోల్ మోడల్ కానుంది అని రాహుల్ గాంధీ ప్రకటించారు. 'మేము చేస్తున్నది కుల గణనే కాదు. పరిపాలన ఎలా ఉండాలో నిర్ణయిస్తున్నాం. ఏ వ్యవస్థలో ఎంత మంది ఓబీసీలు ఉన్నారో తెలుసుకోవాలి. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం అని రాహుల్ గాంధీ ప్రకటన చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com