ఓ వైపు ఉపఎన్నికలు.. మరోవైపు డీకే సోదరుల ఇళ్లలో సీబీఐ సోదాలు

కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌పై సిబీఐ పంజా విసిరింది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఇళ్లు, ఆఫీసుల్లో సీబీఐ ఆకస్మికంగా దాడులు చేసింది. ఓ మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సీబీఐ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. బెంగళూరులో శివకుమార్ నివాసంతో పాటు..కర్ణాటక, దిల్లీ, ముంబై తదితర 14ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు. డీకే శివ కుమార్‌తో పాటు ఆయన సోదరుడు డీకే సురేష్, కుటుంబ సభ్యులు, ఇతర సన్నిహితులకు సంబంధించిన పలు ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు చేసింది. సుమారు 60 మంది అధికారులు ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో 50 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.
కర్ణాటకలో.... సిరా, రాజారాజేశ్వర్‌నగర్ స్థానాలకు... ఉపఎన్నికలు జరుగుతున్న వేళ... డీకే సోదరుల ఇళ్లలో సీబీఐ సోదాలు జరగడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. పీసీసీ అధ్యక్షుడుగా శివకుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో... ఆయన ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నారు. గెలుపు దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ దాడులు జరుగుతుండటంతో... కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి.
మనీలాండరింగ్ కేసులో గత ఏడాది సెప్టెంబర్‌లో డీకే శివకుమార్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆదాయపన్ను శాఖ పైల్ చేసిన ఛార్జీషీట్ ఆధారంగా.. కేసు నమోదు చేసి అదుపులో తీసుకుంది. 50 రోజుల తర్వాత బెయిల్ లభించడంతో.. ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. మనీలాండరింగ్ కేసుల్లో ఢిల్లీహైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
శివకుమార్ ఇంట్లో సీబీఐ సోదాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. రానున్న ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టేందుకే బీజేపీ ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తోందని ఆరోపించింది. బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ ఇలాంటి చర్యలకు పూనుకుందంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కాంగ్రెస్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com