Manish Sisodia : సీబీఐ దాడులకు మేము భయపడము : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Manish Sisodia : సీబీఐ దాడులకు మేము భయపడము : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
Manish Sisodia : దేశ రాజధాని ఢిల్లీ సర్కారులో లిక్కర్ స్కామ్ ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది.

Manish Sisodia : దేశ రాజధాని ఢిల్లీ సర్కారులో లిక్కర్ స్కామ్ ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. గతేడాది నవంబర్‌లో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అవకతవకలు జరిగాయంటూ సీబీఐ దాడులు నిర్వహించడం రాజకీయ దుమారం రేపుతోంది. మద్యం స్కాంలో సీబీఐ సోదాలతో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియా చిక్కుల్లో పడ్డారు. ఈ కుంభకోణానికి సంబంధించి సిసోడియాతో పాటు మొత్తం 15 మందిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. లిక్కర్ స్కాం కేసులో 120-B, 477-A , సెక్షన్-7 కింద సిసోడియాను ఏ-1గా చేర్చిన సీబీఐ అధికారులు.. కొన్ని మద్యం కంపెనీల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఢిల్లీ మద్యం విధానంపై దాఖలైన కేసులో భాగంగా సిసోడియా నివాసంతో పాటు 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 21 చోట్ల ఏకకాలంలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు.

గతేడాది నవంబరులో కేజ్రీవాల్ సర్కారు నూతన ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది. అయితే ప్రైవేటు వ్యాపారులకు లబ్ది చేకూర్చేలా మనీశ్‌ సిసోడియా కొన్ని నిబంధనలను ఉల్లంఘించారని, నూతన అబ్కారీ విధానంతో అవినీతికి పాల్పడ్డారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని విచారణ కమిటీ తేల్చింది. టెండర్ల విధానంలోఆయాచితంగా కొందరికి లబ్ది చేకూరేలా మనీశ్ సిసోడియా నిర్ణయాలు తీసుకున్నారని జులైలో విచారణ కమిటీ నివేదిక ఇచ్చింది. దీనిపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిఫార్సు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. సిసోడియా నివాసంతో పాటు మొత్తం ఏడు రాష్ట్రాల్లో సోదాలు చేపట్టారు.

ఇక సిసోడియా ఆస్తులపై సీబీఐ దాడులను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రపంచంలోనే ఉత్తమ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సిసోడియా లక్ష్యంగా కేంద్రం వేధింపులకు పాల్పడుతోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలనే సీబీఐకి పైనుంచి ఆదేశాలు వచ్చాయని పరోక్షంగా ప్రధాని మోదీపై మండిపడ్డారు.

సీబీఐ దాడులు చేయడం మొదటిసారి కాదని సిసోడియా అన్నారు. గత ఏడేళ్లలో తమ ఇంటిపై పలుసార్లు దాడులు చేసిందని, పలు నకిలీ కేసులు బనాయించారని గుర్తుచేశారు. అయినా సీబీఐ విచారణకు తాము భయపడేది లేదని సిసోడియా స్పష్టంచేశారు.

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ లింకులు ఏపీ, తెలంగాణలోనూ బయటపడటం ప్రకంపనలు రేపుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారవేత్త అరున్ రామచంద్ర పిళ్లై పేరును సీబీఐ ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. ఈ కేసులో సిసోడియాను ఏ1గా పేర్కొన్న సీబీఐ అధికారులు.. రామచంద్ర పిళ్లై పేరు ఏ14గా చేర్చారు. ఇండో స్పిరిట్ పేరుతో బెంగళూరు కేంద్రంగా వ్యాపారం చేస్తున్న రామచంద్ర పిళ్లై.. టెండర్ దక్కించుకునేందుకు అరుణ్ పాండ్యా ద్వారా రెండున్నర కోట్ల డబ్బులు వసూలు చేసినట్లు సీబీఐ అధికారులు పక్కా ఆధారాలు సేకరించింది. హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రామచంద్ర పిళ్లైకి పలువురు రాజకీయ నేతలతో సంబంధాలున్నట్లు సీబీఐ అధికారులు తమ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇటు వైసీపీ ఎంపీ మాగుంటపైనా బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తుండటంతో ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

ఏదిఏమైనా కేజ్రీవాల్‌ సర్కారుపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు, సీబీఐ దాడులు జరపడం సంచలనం రేపుతోంది. సిసోడియాను ఏ1గా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడంతో నెక్స్ట్‌ ఏం జరగబోతోంది అనే చర్చ జరుగుతోంది. నాడు ఎక్సైజ్ శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సిసోడియాను సీబీఐ అరెస్టు చేస్తుందా? సీబీఐ విచారణను సిసోడియా ఎలా ఎదుర్కొంటారు? కేజ్రీవాల్ ఏంచేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story