Kolkata Trainee Doctor: కోల్‌కతా డాక్టర్‌పై గ్యాంగ్ రేప్ జరగలేదు
కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు అని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇతరుల ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. లభ్యమైన సాక్ష్యాధారాలన్నీ సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడని సూచిస్తున్నాయంటూ సీబీఐ వర్గాలు చెప్పాయని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం పేర్కొంది.
ఈ ఘోరమైన నేరం విషయంలో పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై రాజకీయ ప్రత్యర్థులు, ప్రజా సంఘాల నిప్పులు చెరుగుతున్నారు. దీంతో కేసును త్వరగా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని దీదీ డిమాండ్ చేస్తున్నారు. ‘నేను ఈ కేసు దర్యాప్తును ఐదు రోజుల్లో పూర్తిచేయాలని కోరాను కానీ కోర్టు సీబీఐకి అప్పగించింది.. వాళ్లు న్యాయం జరగాలని కోరుకున్నట్టు లేదు.. జాప్యం చేస్తున్నారు.. ఘటన జరిగి 16 రోజులైంది.. ఏది న్యాయం’ అని ఇటీవల కోల్‌కతాలో మీడియాతో అన్నారు. మమతా బెనర్జీ క్యాబినెట్ మంత్రి బ్రత్య బసు సైతం నివేదిక త్వరగా కోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేశారు. ‘కేసు బదిలీ చేసి 23 రోజులు పూర్తయ్యింది.. సీబీఐ దర్యాప్తు నివేదిక గురించి ఎటువంటి పురోగతి లేదు.. దర్యాప్తుకు సంబంధించిన పూర్తి నివేదిక మాకు కావాలి.. కోల్‌కతా పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు మీడియా సమావేశాల ద్వారా రెగ్యులర్ అప్‌డేట్‌లు ఇచ్చేవారు’ అని ఆయన అన్నారు.
అయితే, నిందితుడు డీఎన్ఏ టెస్ట్ సహా మెడికల్ రిపోర్ట్‌ను పరిశీలన కోసం ఎయిమ్స్ నిపుణులకు పంపినట్టు సీబీఐ పేర్కొంది. వారి తుది అభిప్రాయం వెల్లడించిన తర్వాత విచారణను ముగించనుంది. ఇప్పటి వరకూ 100కిపైగా స్టేట్‌మెంట్లు రికార్డు చేసిన అధికారులు.. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌తో పాటు నిందితుడికి 10 పాలిగ్రాఫ్ పరీక్షలను చేసినట్టు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. వైద్యురాలి హత్యాచారం ఘటనలో ఇతరుల ప్రమేయం ఉందనడానికి ఎటువంటి కారణాలు లేవని తెలిపాయి.
ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ డిప్యూటీ సూపరింటిండెంట్ డాక్టర్ అఖ్తర్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరుకు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ విచారించి, అరెస్ట్ చేసింది. వైద్యురాలిపై హత్యాచారం జరిగిన వెంటనే ఆయన్న తొలగించిన మమతా బెనర్జీ ప్రభుత్వం.. మరో ఆసుపత్రికి బదిలీ చేసింది. దీనిపై దుమారం రేగడంతో ఆయన రాజీనామా చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం ఆయన సభ్యత్వాన్ని రద్దుచేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com