CBI: సీబీఐ భారత ప్రభుత్వ అజమాయిషీలోని సంస్థే

రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా పశ్చిమ బెంగాల్‌లో సీబీఐ దర్యాప్తు జరపడాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పశ్చిమ బెంగాల్ వ్యాజ్యానికి విచారణార్హత లేదని కేంద్రం చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2018 నవంబరు 16న రాష్ట్రంలో సీబీఐ విచారణ జరిపేందుకు సాధారణ అనుమతి విరమించుకుంది.
ఇదిలా ఉండగా 2021 మేలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సిఫార్సు, కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. అయితే, రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు అనుమతిని గతంలోనే విరమించుకున్నందున, ఇప్పుడు విచారణ జరపడానికి వీలు లేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకునేందుకు కేంద్రం.. సీబీఐను దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించింది.
సీబీఐ విచారణకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వేసిన వ్యాజ్యానికి విచారణార్హత లేదని కేంద్ర ప్రభుత్వం వాదించింది. సీబీఐ స్వతంత్ర సంస్థ అని, దానిపై కేంద్రం పర్యవేక్షణ, నియంత్రణ ఉండదని కేంద్రం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చడాన్ని తప్పుబట్టారు. పశ్చిమ బెంగాల్ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని సుప్రీంకోర్టును కోరారు.
ఈ అంశాన్ని బుధవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్(డీఎస్‌పీఈ), 1946 ప్రకారం సీబీఐ ఏర్పడిందని, డీఎస్‌పీఈకి సంబంధించిన అధికారాలు, పరిధి, పర్యవేక్షణ మొత్తం కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలోనే ఉంటాయని కోర్టు పేర్కొన్నది.
కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనంత వరకు డీఎస్‌పీఈ కింద ఏర్పడ్డ సంస్థలు రాష్ర్టాల్లో అధికారాలు, పరిధిని విస్తరించడం కుదరదని స్పష్టం చేసింది. డీఎస్‌పీఈ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయా రాష్ర్టాల్లో డీఎస్‌పీఈ ద్వారా ఏర్పడ్డ సంస్థలు అధికారాలను ఉపయోగించలేవని పేర్కొన్నది. పశ్చిమ బెంగాల్ వ్యాజ్యంపై విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com