CC Roads: ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీరోడ్డు

CC Roads: ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీరోడ్డు
కాలేజీ పరిశోధనకు పేటెంట్

ప్రపంచాన్ని ప్లాస్టిక్‌ మింగేస్తోంది. సముద్ర జీవులు, అడవి జంతువులను హరించడంతో పాటు మానవుల ఆహారంలోకి చొరబడుతోంది.రకరకాలుగా మానవ అంతానికి నాంది పలుకుతోంది ప్లాస్టిక్. పర్యావరణానికి గొడ్డలి పెట్టుగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాలతో.. మహరాష్ట్రకు చెందిన పరిశోధకులు సీసీ రోడ్లు నిర్మించారు. వివరాల్లోకి వెళితే

ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతోనే రోడ్డు నిర్మాణం చేసే విధానాన్ని మహారాష్ట్ర అమరావతిలోని రామ్ మేఘె ఇంజినీరింగ్ కళాశాల పరిశోధకులు రూపొందించారు. స్థానిక ఇన్నోవేటివ్ ఎంటర్ ప్రెన్యూర్ బోర్డ్ భాగస్వామ్యంతో ఈ పరిశోధన చేశారు. తక్కువ వ్యయంతో, ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా ఈ రోడ్డును నిర్మించారు. వారు చేసిన ఈ పరిశోధనకు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్‌ లభించింది. ఈ రకమైన పరిశోధన ఆఫ్రికాలో 2005లోనే జరిగింది. దాని ఆధారంగా ఐఐటీ ఖరగ్‌పుర్ 2010-12 మధ్యకాలంలో ఇలాంటి పరిశోధనలు చేపట్టింది. ఆ పద్ధతినే రామ్ మేఘె ఇంజినీరింగ్ కళాశాల పరిశోధక బృందం మరింత అభివృద్ధి చేసి మంచి ఫలితాలను సాధించినట్లు కళాశాల పరిశోధకులు తెలిపారు.

రామ్ మేఘె ఇంజినీరింగ్ కళాశాల అర్కిటెక్చర్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ హర్లే ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సెల్స్ ఆకారంలో తయారు చేసి... వాటిని సీసీ రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తారు. ఇలా చేయడం ద్వారా రోడ్డు ఎక్కడైనా దెబ్బతిన్నా అది రోడ్డు మొత్తాని ప్రభావితం చేయదన్నారు. తారు రోడ్డుతో పోలిస్తే ప్లాస్టిక్ సెల్స్‌తో రోడ్డును నిర్మించడానికి 20 శాతం ఖర్చు తక్కువ అవుతుందని శ్రీకాంత్ తెలిపారు. అంతేకాదు దాదాపు 20 సంవత్సరాల వరకు రోడ్డు చెక్కు చెదరదన్నారు. ఈ పద్ధతిలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించాలని త్వరలో ప్రభుత్వాన్ని కోరనున్నామని శ్రీకాంత్ వెల్లడించారు. దేశాభివృద్ధికి ఈ పరిశోధన ఎంతోగానో తోడ్పడుతుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story