Kolkata Rape Case: లా విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి కేసు.. కీలకంగా మారిన సీసీటీవీ ఫుటేజీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దక్షిణ కలకత్తా లా కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ కేసులో కీలక ఆధారం లభించింది. 24 ఏళ్ల బాధితురాలిపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి బయటపడిన సీసీటీవీ ఫుటేజ్, ఆమె ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. నిందితులు బాధితురాలిని కాలేజీ గేటు నుంచి క్యాంపస్‌లోని గార్డు రూమ్‌లోకి బలవంతంగా లాక్కెళ్లిన దృశ్యాలు ఇందులో స్పష్టంగా రికార్డయ్యాయని కోల్‌కతా పోలీసు వర్గాలు వెల్లడించాయి.
కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో ఉన్న సౌత్ కలకత్తా లా కాలేజీలో ఈ నెల 25న ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అదే కాలేజీలో చదువుతున్న ఇద్దరు సీనియర్ విద్యార్థులు, ఒక మాజీ విద్యార్థి క్యాంపస్‌లోని గార్డు గదిలో బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాతి రోజున బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా ఆదేశాల మేరకే మిగతా ఇద్దరు తనను బలవంతంగా గార్డు రూమ్‌కు తీసుకెళ్లారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. లభించిన సీసీటీవీ ఫుటేజ్ ఆమె వాంగ్మూలాన్ని ధ్రువీకరిస్తోందని, నిందితుల కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఓ పోలీస్ అధికారి తెలిపారు.
పెళ్లికి నిరాకరించడంతోనే దాడి
ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా చేసిన పెళ్లి ప్రతిపాదనను బాధితురాలు తిరస్కరించడమే ఈ ఘాతుకానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, అతడిని మోసం చేయలేనని బాధితురాలు నిందితులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడి పథకం ప్రకారమే జరిగిందా అనే కోణంలో దర్యాప్తు అధికారులు విచారణ జరుపుతున్నారు. నిందితుల్లో ఒకరైన మనోజిత్ మిశ్రా బాధితురాలిపై అత్యాచారం చేయగా, మిగతా ఇద్దరు ఆ దారుణాన్ని వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేయాలని చూసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
నలుగురి అరెస్ట్.. సిట్ దర్యాప్తు
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశారు. వారిలో ప్రధాన నిందితుడు, కాలేజీ పూర్వ విద్యార్థి మనోజిత్ మిశ్రా, ప్రస్తుత విద్యార్థులు ప్రోమిత్ ముఖర్జీ, జైద్ అహ్మద్‌తో పాటు కాలేజీ సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నాడు. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారితో కూడిన ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసును విచారిస్తోంది. శనివారం బాధితురాలిని కాలేజీకి తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. బాధితురాలి వైద్య నివేదికలో బలవంతపు లైంగిక దాడి జరిగినట్టు, శరీరంపై గాట్లు, కొరికిన గాయాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది.
రాజకీయ దుమారం.. సొంత పార్టీలోనే వ్యతిరేకత
ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రాకు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) యువజన విభాగంతో సంబంధాలు ఉండటం రాజకీయంగా కలకలం రేపింది. అయితే, పార్టీతో సంబంధం ఉన్నంత మాత్రాన అతడిని కాపాడేది లేదని టీఎంసీ స్పష్టం చేసింది. మరోవైపు, ఈ ఘటనపై టీఎంసీ నేతలు చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇరుకున పెట్టాయి. "స్నేహితురాలిపై స్నేహితుడే అత్యాచారం చేస్తే భద్రత ఎలా కల్పించగలం? బడుల్లో పోలీసులను పెట్టాలా?" అంటూ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే తరహాలో ఎమ్మెల్యే మదన్ మిత్రా మాట్లాడుతూ "కాలేజీ మూసి ఉన్నప్పుడు ఎవరైనా పిలిస్తే అమ్మాయిలు వెళ్లొద్దని ఈ ఘటన ఓ సందేశం ఇచ్చింది. ఆ అమ్మాయి అక్కడికి వెళ్లకుండా ఉంటే ఇది జరిగేది కాదు" అని అనడం వివాదాన్ని మరింత రాజేసింది.
అయితే, ఈ వ్యాఖ్యలను సొంత పార్టీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా ఖండించారు. "భారత్‌లో మహిళల పట్ల అగౌరవం పార్టీలకు అతీతంగా ఉంది. అయితే, ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించడమే మా పార్టీ ప్రత్యేకత" అని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో టీఎంసీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఈ ఘటనపై ప్రజా ఆగ్రహం పెరుగుతుండగా, టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com