POLLS: నాలుగో విడతలో ప్రముఖులు.. కేంద్రమంత్రులు

POLLS: నాలుగో విడతలో ప్రముఖులు.. కేంద్రమంత్రులు
X
రసవత్తరంగా దేశ రాజకీయ ముఖచిత్రం.... సత్తా చాటేందుకు వ్యూహాలు

సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో పలువురు కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోసారి గెలిచి తమ సత్తాను చాటేందుకు కేంద్ర మంత్రులు ప్రయత్నిస్తుండగా ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్‌స్ర్కీన్‌లోనూ తమకు పట్టు ఉందని నిరూపించుకోవాలని సినీప్రముఖులు తహతహలాడుతున్నారు. నాలుగో విడతలో ప్రముఖులు పోటీ చేస్తున్న కీలక నియోజకవర్గాలపై ప్రత్యేక కథనం. బిహార్‌లో అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటైన బెగూసరాయ్‌ నుంచి కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తరఫున ఈసారి ఆయనే బరిలో ఉన్నారు. బెగూసరాయ్‌ని బిహార్‌ మినీ మాస్కోగా పిలుస్తారు. ఇక్కడ భూమిహార్‌ వర్గం ప్రజల ప్రాబల్యం ఎక్కువ. గిరిరాజ్‌ సహా ఈ స్థానంలో ఇప్పటిదాకా గెలిచిన ఎంపీల్లో అత్యధికులు ఆ వర్గంవారే.


పశ్చిమ్‌ బెంగాల్‌లోని బహరంపుర్‌ నియోజకవర్గంలో పోరు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక్కడ వరుసగా అయిదుసార్లు గెలుపొందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, సిటింగ్‌ ఎంపీ అధీర్‌రంజన్‌ చౌధరీ మరోసారి పోటీలో ఉన్నారు. ఆయనపై భారత జట్టు మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ను తృణమూల్‌ కాంగ్రెస్‌ బరిలో దింపింది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉండగా.... వాటిలో ఆరు తృణమూల్‌ ఖాతాలోనివే. మరొకటి భాజపా సిటింగ్‌ స్థానం. ఈ నియోజకవర్గంలో ముస్లింలు 50% వరకూ ఉన్నారు. వారి అండతో ఈసారి పఠాన్‌ కచ్చితంగా విజయం సాధిస్తారని తృణమూల్‌ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. పఠాన్‌ స్థానికేతరుడని ప్రచారంలో కాంగ్రెస్‌ పదేపదే పేర్కొంటోంది. భాజపా ఇక్కడ నిర్మల్‌కుమార్‌ సాహాకు టికెట్‌ కేటాయించింది.


ఝార్ఖండ్‌లోని ఖూంటీ స్థానంలో సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న అర్జున్‌ ముండా.. భాజపా అభ్యర్థిగా మరోసారి అక్కడే పోటీకి దిగారు. మూడుసార్లు ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్వరాష్ట్రంలోనే కాకుండా బిహార్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలోనూ గిరిజన దిగ్గజ నేతల్లో ఒకరిగా ఈయనకు పేరుంది. 2019లో కాంగ్రెస్‌ అభ్యర్థి కాళీచరణ్‌ ముండాపై 1,445 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ప్రస్తుతం హస్తం పార్టీ మళ్లీ కాళీచరణ్‌కే టికెట్‌ కేటాయించింది. దీంతో మరోసారి హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఖూంటీ ఎస్టీ రిజర్వుడు సీటు. 1984 తర్వాత భాజపా ఇక్కడ ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది.

బాలీవుడ్‌ బిహారీ బాబుగా అందరికీ సుపరిచితులైన కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్‌ స్థానంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 50% మంది బెంగాలీయేతరులే. అందులోనూ అత్యధికులు బిహారీలే. అందుకే 2022 ఉప ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఇక్కడ శత్రుఘ్నకు తృణమూల్‌ టికెట్‌ ఇచ్చింది. నాడు విజయం సాధించిన ఆయన.. మళ్లీ ఇప్పుడు బరిలో దిగారు. ఆయన్ను బయటి వ్యక్తిగా ప్రచారం చేస్తున్న భాజపా.. స్థానిక నేత, సర్దార్‌జీగా అందరూ పిలుచుకునే కేంద్ర మాజీ మంత్రి సురేంద్రజీత్‌సింగ్‌ అహ్లువాలియాకు టికెట్‌ కేటాయించింది.

Tags

Next Story