CENSUS: రెండు దశల్లో చరిత్రాత్మక డిజిటల్ గణన
చరిత్రాత్మక జనగణన నిర్వహణ కోసం కేంద్ర మంత్రివర్గం ఏకంగా రూ.11,718 కోట్లకు సంబంధించిన బడ్జెట్‌ను ఆమోదించింది. అలాగే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును కూడా మార్చింది. పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజనగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కి పెంచింది. రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కి సవరించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. జనగణనలో కుల గణను చేర్చడంతోపాటు రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించారు. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు గృహాలను జాబితా చేసి, లెక్కిస్తామని చెప్పారు. 2027 ఫిబ్రవరి నుంచి జనాభా లెక్కల సేకరణపై దృష్టి పెడతామన్నారు. ఇదే తొలి డిజిటల్ జనగణన అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ జనగణన ప్రక్రియకు సంబంధించి మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా నిర్ణయించారు. జనగణన మొదటి దశ ఏప్రిల్ 2026 నుండి సెప్టెంబర్ 2026 వరకు కొనసాగుతుంది, రెండవ దశ ఫిబ్రవరి 2027లో పూర్తవుతుంది.
బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సాధారణ, జీవిత, ఆరోగ్య బీమాలో 74 శాతం వరకు ఎఫ్‌డీఐకి అనుమతి ఉంది. ఈ రంగంలోకి ఎఫ్‌డీఐలకు పూర్తిగా అనుమతినిస్తే దేశీయ పెట్టుబడులూ పెరిగే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేస్తోంది. 100 శాతం ఎఫ్‌డీఐకి అనుమతిస్తే విదేశీ సంస్థలు భారతీయ కంపెనీలపై ఆధారపడకుండా సొంతంగా పనిచేయడానికి ఆస్కారం ఏర్పడుతుందని, దీనివల్ల ఈ రంగానికి మేలు జరిగే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతోంది.కేబినెట్ తీసుకున్న ఆర్థికపరమైన నిర్ణయాల గురించి మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ దేశీయ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుదలను కూడా ప్రస్తావించారు. దేశీయంగా ఉత్పత్తి పెరగడం వల్ల ఆర్థికపరమైన నిర్ణయాల సానుకూల ఫలితంగా దేశానికి సుమారు రూ.60,000 కోట్ల విదేశీ కరెన్సీ ఆదా అవుతోందని పేర్కొన్నారు. బొగ్గు గనుల్లో పలు సంస్కరణలకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద అందించే మొత్తాన్ని రూ.6,000 నుంచి రూ.10,000 వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో తెలంగాణకు 4, ఆంధ్రప్రదేశ్‌కు 4 మంజూరు చేసింది. నాలుగు కీలకమైన రైల్వే ప్రాజెక్టులకూ ఆమోదం తెలిపింది.సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి రూ.2,000 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు. పీఎం కిసాన్ సంపద యోజనకు రూ.6,520 కోట్లు కేటాయించనున్నారు. క్వాంటం టెక్నాలజీ పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడానికి అదనంగా రూ.4,000 కోట్ల నిధులు కేటాయించనున్నారు.మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌లకు బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు లభించేందుకు వీలుగా రూ.15,000 కోట్లతో కొత్త క్రెడిట్ గ్యారెంటీ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలోని డిజిటల్ మౌలిక సదుపాయాలను రక్షించడానికి సైబర్ దాడులను నిరోధించడానికి సైబర్ సెక్యూరిటీ పాలసీకి ఆమోదం తెలిపింది.సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించేందుకు రూ.12,000 కోట్లు కేటాయింపు. కొత్త సెమీకండక్టర్ తయారీ కర్మాగారాలను నెలకొల్పే సంస్థలకు ఆర్థిక సహాయం పెంపు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అదనంగా 1.5 కోట్ల గృహాలను నిర్మించడానికి ఆమోదం ఇచ్చింది.చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి వీలుగా తమిళనాడులోని కులశేఖరపట్నం వద్ద కొత్త ప్రయోగ వేదిక నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ తెలిపింది. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని రక్షణ రంగంలో బలోపేతం చేయడానికి, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంపునకు ఆమోదం అలభించింది.దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య సేవలను అందించడానికి నేషనల్ టెలి-మెడిసిన్ నెట్వర్క్ ఏర్పాటుకు ఆమోదం ఇచ్చింది. నీటిపారుదల పథకాలకు జాతీయ మిషన్ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com



