Elections: జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

Elections: జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం
X
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు


జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సమర్పించిన నివేదికకు ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా ఈ కీలక నిర్ణయం తీసుకొంది. ఏకాభిప్రాయ సాధన ద్వారా ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన కాలంలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నట్లు కేంద్ర సమాచార- ప్రసారశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. తొలిదశలో పార్లమెంటు-అసెంబ్లీ ఎన్నికలను, అవి పూర్తయిన వంద రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న కమిటీ సిఫార్సుల ప్రకారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయనుంది. ఈ విధానం అమల్లోకి వచ్చాక దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలకూ ఒకే ఓటరు జాబితాను ఉపయోగిస్తారు.

‘‘దేశవ్యాప్తంగా 1951 నుంచి 1967 వరకు అన్ని ఎన్నికలూ ఏకకాలంలో నడిచాయి. ఆ తర్వాత ఇందులో మార్పులు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీలు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మేలని 1999లో లా కమిషన్‌ పేర్కొంది. 2015లో పార్లమెంటరీ కమిటీ కూడా అదే విషయాన్ని సిఫార్సు చేసింది. ఆ అంశానికి దేశవ్యాప్తంగా విస్తృత మద్దతు లభించింది. కేంద్ర కేబినెట్‌ ఏకగ్రీవంగా నివేదికలోని సిఫార్సులను ఆమోదించింది’’ అని వైష్ణవ్‌ వెల్లడించారు. రాజకీయపార్టీల్లో అత్యధికం ఈ విధానానికి మద్దతు పలికినట్లు చెప్పారు. ఈ విధానం మన ప్రజాస్వామ్యాన్ని, కేంద్ర-రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. న్యాయప్రక్రియ అంతా పూర్తయితేనే కానీ ఈ విధానం ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందో చెప్పలేమన్నారు. (2029 నుంచి లోక్‌సభ, శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు జరపడానికి; ఒకవేళ ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాకపోతే ఐక్యత ప్రభుత్వ ఏర్పాటుకు లా కమిషన్‌ సిఫార్సు చేస్తుందని సంబంధిత వర్గాల సమాచారం)

ఆచరణాత్మకం కాదు: ఖర్గే

వన్ నేషన్, వన్ ఎలక్షన్స్ ఆచరణ సాధ్యం కాదని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు. కేంద్రం ఈ ప్రతిపాదనను ప్రజలెవరూ అంగీకరించని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసలు సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ ఇలా చేస్తుందని ఖర్గే ఆరోపించారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ కమిటీ నివేదికపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంతో తాము విభేదిస్తున్నామని ఖర్గే వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం పనిచేయదన్నారు. మన దేశ ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే అవసరమైనప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఖర్గే పేర్కొన్నారు.

Tags

Next Story