కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆఫీసుల్లో Y బ్రేక్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆఫీసుల్లో Y బ్రేక్
వర్క్ ప్లేస్లోనే యోగాతో రిలాక్స్ అండ్ రిఫ్రెష్

ఊరుకుల పరుగుల జీవితం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఆఫీసుకి పరుగులు పెట్టామా. ఇదే రొటీన్ అందరికీ.. యోగా, ప్రాణాయామాలు ఆరోగ్యాన్ని ఇస్తాయని, ఒత్తిడిని తగ్గిస్తాయి అని తెలిసినా కాసేపు కూడా ప్రశాంతంగా కూర్చోలేని పరిస్థితి. అందుకే ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుందికేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఇక నుంచి యోగా బ్రేక్ తీసుకోవాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

తమ బిజీ షెడ్యూల్ కారణంగా యోగా చేయలేని వారు, కార్యాలయాల్లో తమ కుర్చీల్లో కూర్చొని యోగా చేయొచ్చని తెలిపింది. ఇప్పటి వరకు మనకి లంచ్ బ్రేక్, టీ, టిఫిన్ కోసం బ్రేక్‌లు ఉండేవి. కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఈ వై- బ్రేక్ నుకూడా తీసుకురావటంతో ఉద్యోగులుసైతం ఆశ్చర్యపోతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోని అన్ని శాఖల్లోని ఉద్యోగులు ఈ యోగా బ్రేక్ ను తీసుకోవాలని సిబ్బంది శిక్షణ, వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పనివేళల్లో ఒత్తిడి తగ్గించుకొని రిలాక్స్ తో పాటుగా రిఫ్రెష్ అయ్యేందుకు కార్యాలయాల్లోనే కుర్చీలో కూర్చొనే యోగా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సిబ్బంది శిక్షణ, వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, కుర్చీల్లో కూర్చొని ఎలాంటి ఆసనాలు వెయ్యవచ్చు అనే ఇన్ఫర్మేషన్ కోసం, కొన్ని యూట్యూబ్ వీడియోల లింక్‌లను మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో జతచేసింది.

యోగ ఎట్ వర్క్ ప్లేస్ అంటూ సాగే ఈ యూట్యూబ్ వీడియో లలో ఆఫీస్ డస్క్ దగ్గరే ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానానికి సంబంధించిన విధానాలు వివరంగా ఉన్నాయి. వీటిని నిపుణుల సూచనలతో రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ చెప్పింది. అంతే కాకుండా తమ యోగా పోర్టల్ వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ, ఆయుష్ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాయి. అన్ని కార్యాలయాల్లోని ఉద్యోగులకోసం ఈ కొత్త యోగా ప్రొటోకాల్ ను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం, అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలను కోరింది. ప్రభుత్వ శాఖలు వై-బ్రేక్ గురించి ఉద్యోగుల్లో అవగాహన కల్పించాలని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story