YouTube: 8 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం వేటు.. అందులో ఏడు భారత్‌కు చెందినవే..
YouTube: నకిలీ వార్తల వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మరికొన్ని యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించింది.. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయన్న కారణంతో గతంలో పలు యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించింది కేంద్రం.. తాజాగా మరో 8 యూట్యూబ్ ఛానెళ్లను బ్యాన్ చేసింది. ఇందులో భారత్‌కు చెందిన ఏడు ఛానెళ్లు ఉండగా.. పాకిస్తాన్‌కు చెందిన ఒక యూట్యూబ్ ఛానెల్ ఉన్నట్లుగా కేంద్రం తెలిపింది.
బ్యాన్‌కు గురైన ఛానెళ్లకు 85 లక్షల మందికిపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.. ఇందులో వీడియోలను 114 కోట్ల మందికిపైగా వీక్షించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ ఛానెళ్లలోని వీడియోల్లో ప్రకటనలు ఇస్తున్నట్లుగా కేంద్రం గుర్తించింది.. భారత ప్రభుత్వం మతపరమైన కట్టడాలను కూల్చేస్తోందని, మతపరమైన పండుగలను జరుపుకోవడంపై నిషేధం విధిస్తోందని, మత యుద్ధాన్ని ప్రకటించినట్లుగా ఈ ఛానెళ్లలో ప్రసారాలు ఉన్నాయని గుర్తించింది..
ఇలాంటి కంటెంట్ వల్ల దేశంలో మత సామరస్యం దెబ్బతింటుందని, ప్రజా శాంతికి విఘాతం కలుగుతుందని అందువల్లే ఈ ఛానెళ్లపై నిషేధం విధించినట్లు కేంద్రం తెలిపింది. గతేడాది నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తంగా 102 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసింది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని బలహీనపర్చేలా సోషల్ మీడియా ప్రయత్నిస్తే వాటిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com