Central Power : రాష్ట్రాల కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం

Central Power : రాష్ట్రాల కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం
Central Power : విద్యుత్ బకాయిలు చెల్లించని రాష్ట్రాలకు ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజీల నుంచి లావాదేవీలు జరపవద్దని కేంద్రం నిషేధం విధించింది.

Central Power : రాష్ట్రాలకు కేంద్రం షాక్‌ఇచ్చింది. విద్యుత్ బకాయిలు చెల్లించని రాష్ట్రాలకు ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజీల నుంచి లావాదేవీలు జరపవద్దని నిషేధం విధించింది. ఈ ఆదేశాలు గురువారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి తీసుకువచ్చింది. తెలంగాణ, ఏపీలతోపాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల 29 విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఈ నిషేధం వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది. ఈమేరకు విద్యుత్‌ శాఖ పరిధిలోని పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ ఆయా రాష్ట్రాలకు లేఖలు పంపింది.

తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ.1,380 కోట్ల మేర విద్యుత్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా చాలా విద్యుత్‌ సరఫరా సంస్థలు గడువు తీరి నెల రోజులైనా విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిలు చెల్లించలేదని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 29 విద్యుత్‌ సంస్థల నుంచి 5వేల కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉంది.

విద్యుత్‌ ఉత్పత్తికి మించి డిమాండ్‌ ఉన్న రాష్ట్రాలు ఆ లోటును పూడ్చుకోవడానికి ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేస్తుంటాయి. అలాగే విద్యుత్‌ డిమాండ్‌ తగ్గి, మిగిలిపోయినప్పుడు దానిని ఎనర్జీ ఎక్స్చేంజీలో విక్రయిస్తుంటాయి. కేంద్రం తాజాగా నిషేధం విధించడంతో ఆయా రాష్ట్రాలు విద్యుత్‌ కొనుగోలు, అమ్మకాల అవకాశాన్ని కోల్పోనున్నాయి.

రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతుండటంతో ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్‌ డిమాండ్‌ తక్కువగా ఉంది. ఇదే సమయంలో కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం, సాగర్, జూరాల, పులిచింతల ప్రాజెక్టుల్లో గణనీయంగా విద్యుదుత్పత్తి జరుగుతోంది. అందువల్ల ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి విద్యుత్‌ కొనుగోళ్లపై నిషేధం ప్రభావం పెద్దగా కనబడే అవకాశం లేవు. వానలు తగ్గితే మాత్రం అక్కడక్కడా కోతలు విధించే పరిస్థితి ఎదురుకానుంది.

ఆదానీ పవర్‌ కంపెనీ నుంచి కొన్న సౌర విద్యుత్‌ బిల్లులను గడువులోగా చెల్లించలేదంటూ.. కేంద్రం గత వేసవిలోనూ బకాయిలు చెల్లంచని రాష్ట్రాలపై నిషేధం విధించింది. అయితే ఆ నిషేధంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్రానికి ఊరట లభించింది. హైకోర్టు స్టే ఉన్నా ఐఈఎక్స్‌ లావాదేవీలపై నిషేధం విధించడంపై పలురాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేస్తామని తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story