Centre on Electricity : విద్యుత్ శాఖను కూడా ప్రైవేటు పరం చేయనున్న కేంద్ర ప్రభుత్వం..

Centre on Electricity : విద్యుత్ శాఖను కూడా ప్రైవేటు పరం చేయనున్న కేంద్ర ప్రభుత్వం..
Centre on Electricity : విద్యుత్‌ పంపిణీ రంగంలో పోటీ వాతావరణం సృష్టించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది.

Centre On Electricity : విద్యుత్‌ పంపిణీ రంగంలో పోటీ వాతావరణం సృష్టించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఇంత కాలం ఈ రంగంపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలకు కత్తెర వేస్తూ విద్యుత్‌ చట్టాన్ని సవరిస్తోంది. దేశంలో ఎక్కడైనా విద్యుత్‌ పంపిణీ రంగంలోకి ప్రైవేటు సంస్థలు వచ్చేలా వెసులు బాటు కల్పించింది.

ప్రస్తుతం మొబైల్‌ వినియోగదారులు ఎలానైతే...తమకు ఇష్టం వచ్చిన నెట్‌వర్క్‌ను ఎంచుకుంటున్నారో విద్యుత్‌ కనెక్షన్ల విషయంలోనూ నచ్చిన సంస్థ నుంచి కరెంటు పొందేలా విద్యుత్ చట్టంలో మార్పులు చేస్తున్నారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విద్యుత్‌ శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే విద్యుత్‌ సంరక్షణ బిల్లును కేంద్రం పార్లమెంటులో పెట్టింది.

ఒకే ప్రాంతంలో పలు కంపెనీలు కరెంటు సరఫరా చేసేటప్పుడు....పోటీ ఏర్పడి కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచడం లేదా తగ్గించడం వంటి చర్యలకు పాల్పడకుండా ఛార్జీ గరిష్ఠంగా ఎంత ఉండాలి, కనిష్ఠంగా ఎంత ఉండాలనే' సీలింగ్‌ నిబంధనలను ERC రూపొందించాలని నిబంధన పెట్టింది. ఒక మెగావాట్‌కన్నా ఎక్కువ కరెంటు వినియోగిస్తుంటే వ్యక్తి....దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్‌ కొనే వెసులుబాటు కల్పించింది.

ఒకే ప్రాంతంలో పలు కంపెనీలకు విద్యుత్‌ పంపిణీ లైసెన్సులిస్తే వాటి కోసం క్రాస్‌ సబ్సిడీ నిధిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పాత డిస్కంలు విద్యుదుత్పత్తి సంస్థలతో దీర్ఘకాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకుని కరెంటు కొని ప్రజలకు సరఫరా చేస్తున్నాయి. అవి పంపిణీ చేసే ప్రాంతంలోనే కొత్త కంపెనీలకు విద్యుత్‌ పంపిణీ వ్యాపారానికి లైసెన్సులిస్తే...పాత డిస్కంకు పీపీఏలో నిర్దేశించిన ఖర్చులను కొత్త కంపెనీలు కూడా పంచుకోవాలి.

ఈ పంపకాలు ఎలా ఉండాలనేది ఈఆర్‌సీ నిర్ణయించాలి. దేశంలో ప్రతి సబ్‌స్టేషన్‌, విద్యుదుత్పత్తి కేంద్రం, పంపిణీ సంస్థలు కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఛార్జీలు తగ్గించాలన్నా, పెంచాలన్నా సంబంధిత టారీఫ్‌ సవరణ ప్రతిపాదనలను నిర్ణీత గడువులోగా డిస్కంలు ఈఆర్‌సీకి అందజేయాలి. వాటిపై 90 రోజుల్లోగా విచారణ జరిపి తుది ఆదేశాలివ్వాలి. ఇంతకాలం ఈ విచారణ గడువు 120 రోజులుండగా 90కి తగ్గించాలని బిల్లులో ప్రతిపాదించారు.

రాష్ట్ర ఈఆర్‌సీలో ఛైర్మన్‌ కాక మరో ముగ్గురు సభ్యులుండాలని చట్టంలో నిబంధన పెట్టింది కేంద్రం. ఇందులో ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీచేయకపోతే...రాష్ట్ర మండలి విధులను మరో రాష్ట్ర కమిషన్‌కు కేటాయించేలా కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి అధికారం కల్పించింది. కొత్త చట్టం ప్రకారం రాష్ట్ర ఈఆర్‌సీ ఛైర్మన్‌గా ఏదైనా విద్యుత్‌ సంస్థ ఛైర్మన్‌గా పనిచేసినవారిని లేదా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి హోదాలో పనిచేసిన వారిని నియమించాలి. ఆ వ్యక్తికి కనీసం రెండేళ్ల పాటు విద్యుత్‌ రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలని కండీషన్ పెట్టింది.

Tags

Read MoreRead Less
Next Story