Prices In India: ధరల భారం నుండి ప్రజలకు ఊరట.. పన్నులు తగ్గించాలని యోచిస్తున్న కేంద్రం..

Prices In India: ధరల భారం నుంచి ప్రజలకు ఊరటనిచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. వంట నూనెలతో సహా కొన్ని ఆహార పదార్థాలపై పన్నులు తగ్గించాలని కేంద్ర భావిస్తోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం ఇంధన ధరలతో పాటు వంట నూనెలపై భారీగా చూపింది. దీంతో దేశీయ మార్కెట్లో వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయి. ఇంధన ధరల పెరుగుదల నిత్యావసర వస్తువులపై ప్రభావం పడింది. దీంతో సామాన్య జనం ఏం కొనలేక, తినలేక అన్న పరిస్థితి నెలకొంది.
ఇటీవల జరిగిన రాష్ట్రాల సీఎంలతో సమీక్ష సందర్భంగా ఇంధనంపై వ్యాట్ ను రాష్ట్రాలు తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు కేంద్రం ప్రభుత్వం వంటనూనెలపై పన్నులు తగ్గించే యోచన చేస్తోంది. పామాయిల్ దిగుమతులపై ఉన్న సెస్ ను 5 శాతానికి తగ్గించాలని చూస్తోంది. ముడి పామాయిల్ పై బేస్ దిగుమతి సుంకాన్ని ఇప్పటికే రద్దు చేశారు.
భారత్ తన వంటనూనె అవసరాల్లో 60శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండడంతో.. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రెండేళ్ల నుంచి ధరలు పైపైకి వెళ్తున్నాయి. ఇండోనేషియా పామాయిల్ ఎగెమతులపై నిషేధం విధించడంతో పరిస్థితి మరింత దిగజారింది. సరిపడా దిగుమతులు లేక దేశంలో పామ్, సోయాబీన్ నూనెల ధరలు అమాంతంపెరిగాయి.
గతంలో పామ్, సోయాబీన్, సన్ ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాలను తగ్గించడం, నిల్వలపై ఆంక్షలు విధించినా ధరల అదుపు సాధ్యం కాలేదు. కేంద్ర తాజాగా ముడి నూనెల దిగుమతి సుంకాలను 35 శాతం నుంచి అయిదు శాతానికి తగ్గించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com