Central Government: రూ.500 కోట్లకు మించిన పథకాల విషయంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం..

Central Government: రూ.500 కోట్లకు మించిన పథకాల విషయంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం..
Central Government: ఇకపై కేంద్ర పథకాల నగదు 100 శాతం నేరుగా లబ్దిదారులకే అందించేందుకు కసరత్తు చేస్తోంది.

Central Government: మోదీ సర్కారు.. మరో కీలకమైన ఆలోచన చేస్తోంది. ఇకపై కేంద్ర పథకాల నగదు 100 శాతం నేరుగా లబ్దిదారులకే అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది. 500 కోట్లు అంతకు మించిన పథకాల విషయంలో ఈ విధానం అమల్లోకి రానుంది. స్వతంత్ర ప్రతిపత్తి గల నోడల్ ఏజెన్సీ ద్వారా దీన్ని పర్యవేక్షించనున్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను ఏపీ సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దుర్వినియోగం, దారి మళ్లింపు చేస్తున్నాయని ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.. కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖలకు ఫిర్యాదులు అందాయి.. కేంద్రం ఇస్తున్న నిధులతో పథకాలు అమలు చేస్తూ తామే ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయని.. నిధులు ఇస్తున్నా ఫలితం దక్కకపోవడంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం..

మరోవైపు నిధులు ఖర్చు చేయడంలో అలసత్వం, తగిన సమయానికి అందజేయకపోవడం లాంటి కారణలతో కూడా కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. పంటల బీమా, కిసాన్‌ సమ్మాన్‌ నిధి సహా రైతులకు లబ్ధి చేకూర్చే పథకాలు, నిరుపేదలకు ఎల్పీజీ గ్యాస్‌ కనెక్షన్లు, కార్మిక సంక్షేమ పథకాలు సహా అనేక రంగాల్లోని కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు నుంచి రాష్ట్రాలను తప్పించి నేరుగా లబ్ధిదారులకు మరింత లాభం జరిగేందుకే కొత్త విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి..

ప్రస్తుత విధానంలో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల నిధులను ఆయా మంత్రిత్వ శాఖలు రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి డ్రా చేసుకుని రాష్ట్ర ఖజానాలకు బదిలీ చేస్తుండగా అక్కడి నుంచి సంబంధిత రాష్ట్ర మంత్రిత్వ శాఖలకు వెళ్తున్నాయి.. అక్కడి నుంచి సంబంధిత అమలు ఏజెన్సీలకు, అక్కడి నుంచి జిల్లా లేదా తాలూకా స్థాయికి వెళ్లి అక్కడి నుంచి చివరకు లబ్ధిదారులకు అందుతున్నాయి..

ఈ విధానంలో లోపాలు, దుర్వినియోగం, దారి మళ్లింపు, అసలు ఖర్చు చేయకపోవడం, సొంత ప్రచారానికి వాడుకోవడం సహా అడ్డంకులను నివారించేందుకే ఈ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. లబ్ధిదారులకు వీలైనంత తక్కువ సమయంలో నేరుగా అందించాలనే దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెప్తున్నాయి.

కొత్త మార్గదర్శకాలపై అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల నుంచి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయాలు తీసుకుంటోంది.. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచే కొత్త విధానాన్ని అమలులోకి తేవాలని కేంద్రం ఆలోచిస్తోంది.. ట్రెజరీ సింగిల్‌ అకౌంట్‌ ద్వారా నూతన విధానాన్ని అమలు చేయాలనుకుంటోంది..

కొత్త విధానంలో దేశ సంచిత నిధి నుంచి రిజర్వు బ్యాంకు ద్వారా నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేయనుంది.. నూతన విధానం అమలులోకి వస్తే కేంద్ర మంత్రిత్వ శౄఖలో స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రత్యేక విభాగం సెంట్రల్‌ నోడల్‌ ఏజెన్సీగా ఏర్పాటు అవుతుంది.. ఈ నోడల్‌ ఏజెన్సీలు రిజర్వ్‌ బ్యాంకులో అకౌంట్స్‌ ప్రారంభించనున్నాయి..

500 కోట్లలోపు వుండే పథకాల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములను చేసినప్పటికీ అమలుకు ప్రతి కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక కేంద్రీయ సంస్థను భాగస్వాములను చేస్తుంది.. ఆ సంస్థే వాణిజ్య బ్యాంకుల్లో అకౌంట్‌ ఓపెన్‌ చేస్తుంది.. కేంద్రం ఇచ్చే నిధులు నేరుగా ఆ అకౌంట్‌కు వెళతాయి.. అక్కడ్నుంచి లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేస్తారు. ఇదే జరిగితే.. రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story