Sonam Wangchuk: లడఖ్ నిరసనలు..సోనమ్ వాంగ్‌చుక్‌ సంస్థ లైసెన్సు రద్దు..

Sonam Wangchuk: లడఖ్ నిరసనలు..సోనమ్ వాంగ్‌చుక్‌ సంస్థ లైసెన్సు రద్దు..
X
వాంగ్‌చుక్‌పై సీబీఐ దర్యాప్తు

రాష్ట్ర హోదా కోరుతూ, లడఖ్ వ్యాప్తంగా హింసాత్మక అల్లర్లు జరిగాయి. భద్రతా బలగాలు, బీజేపీని టార్గెట్ చేస్తు ఆందోళనకారులు హింసకు పాల్పడ్డారు. ఈ అల్లర్లలో నలుగురు మరణించారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు.ఈ అల్లర్లు ఉద్దేశపూర్వకంగా చేయబడ్డాయని లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా ఆరోపిస్తూ, లేహ్ వ్యాప్తంగా ఖర్ఫ్యూ విధించారు. అల్లర్ల వెనక ఉన్న ప్రతీ వ్యక్తిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

అయితే, ఈ అల్లర్లతో లడఖ్ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రమేయం ఉన్నట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం సోనమ్ వాంగ్‌చుక్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. వాంగ్‌చుక్ రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే బీజేపీ కార్యాలయం, స్థానిక ఎన్నికల అధికారిపై దాడి చేసినట్లు హోంమంత్రిత్వ శాఖ ఆరోపించింది. దీనిలో కుట్ర కోణం ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది.

ఈ వ్యవహారంలో వాంగ్‌చుక్ ఎన్జీవోకు విదేశీ నిధులు ఎలా వస్తున్నాయనే దానిపై కేంద్రం దర్యాప్తు మొదలుపెట్టింది. విదేశీ నిధుల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు, విదేశీ సహకార నియంత్రణ చట్టం (FCRA)ను పదే పదే ఉల్లంఘించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆయన ఏజెన్సీ ‘‘హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లడఖ్(HIAL)’’ కార్యకలాపాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, సోమన్ వాంగ్‌చుక్ నడిపిస్తున్న ఎన్జీవో సంస్థ విదేశీ నిధుల నియంత్రణ చట్టాన్ని పదే పదే ఉల్లంఘించిన కారణంతో ప్రభుత్వం ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్‌ని రద్దు చేసింది. లడఖ్‌లో హింసాత్మక నిరసనలు జరిగి 24 గంటలు గడవక ముందే కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. దీంట్లో భాగంగానే ఆయన ఎన్జీవో లైసెన్స్ రద్దు చేసింది.

Tags

Next Story