UPS: కేంద్రం నుంచి కొత్త పెన్షన్ విధానం..

UPS: కేంద్రం నుంచి కొత్త పెన్షన్ విధానం..
X
23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి

ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌(యూపీఎస్‌) పేరుతో కొత్త పింఛన్‌ పథకాన్ని శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ఉద్యోగి తన పదవీ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న బేసిక్‌ పే సగటులో 50 శాతం కచ్చితంగా పింఛన్‌ రూపంలో అందుతుంది. 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కొత్త పింఛన్‌ పథకం వర్తిస్తుంది.

2004లో తీసుకువచ్చిన కొత్త పింఛన్‌ పథకాన్ని(ఎన్‌పీఎస్‌) రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2023 ఏప్రిల్‌లో కేంద్రం టీవీ సోమనాథన్‌ నేతృత్వంలో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను ప్రభుత్వం రూపొందించింది. శనివారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాన్ని ఆమోదించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు.

యూపీఎస్‌లోని ముఖ్య అంశాలు

కచ్చితమైన పింఛన్‌: కనీసం 25 ఏండ్ల సర్వీసు ఉన్న వారు కచ్చితమైన పింఛన్‌కు అర్హులు. వీరు పదవీ విరమణకు ముందు 12 నెలల పాటు అందుకున్న బేసిక్‌ పే సగటు 50 శాతం పింఛన్‌ రూపంలో ప్రతి నెల కచ్చితంగా అందుతుంది. కనీసం పదేండ్ల పైన, 25 ఏండ్లకు తక్కువ సర్వీసు చేసి పదవీ విరమణ పొందిన వారికి వారి సర్వీసుకు తగ్గట్టుగా పింఛన్‌ ఉంటుంది.

కచ్చితమైన కుటుంబ పింఛన్‌: ఉద్యోగి మరణించే నాటికి అందుకుంటున్న పింఛన్‌లో 60 శాతం కచ్చితమైన కుటుంబ పింఛన్‌గా ఉద్యోగి కుటుంబానికి అందుతుంది. కచ్చితమైన కనీస పింఛన్‌: కనీసం పదేండ్ల సర్వీసు ఉండి రిటైర్‌ అయిన వారికి కనిష్టంగా రూ.10,000 కచ్చితంగా పింఛన్‌ అందుతుంది.

ద్రవ్యోల్బణ ఇండెక్సేషన్‌: కచ్చితమైన పింఛన్‌, కచ్చితమైన కుటుంబ పింఛన్‌, కచ్చితమైన కనీస పింఛన్‌పై ఇండెక్సేషన్‌ ప్రయోజనం ఉంటుంది. ఇది డియర్‌నెస్‌ రిలీఫ్‌ ఆల్‌ ఇండియా కన్జూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ వర్కర్స్‌(ఏఐసీసీఐ-ఐడబ్ల్యూ)పై ఆధారపడి ఉంటుంది.

గ్రాట్యూటీకి అదనంగా పదవీవిరమణ సమయంలో ఉద్యోగులకు కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది. ప్రతి ఆరు నెలల సర్వీసు పూర్తిపై నెల వేతనం(పే + డీఏ)లో పదో వంతును లెక్కగట్టి ఇస్తుంది. ఈ చెల్లింపు కచ్చితమైన పింఛన్‌ మొత్తాన్ని తగ్గించదు.

యూపీఎస్‌ ఎవరికి?

ఎన్‌పీఎస్‌లో కొనసాగడమా? కొత్తగా యూపీఎస్‌లో చేరడమా అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే నిర్ణయించుకోవచ్చని అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టత ఇచ్చారు. ఇది 2004లో ఎన్‌పీఎస్‌ను అమలులోకి తీసుకొచ్చినప్పటి నుంచి యూపీఎస్‌ అమలులోకి వచ్చే ముందురోజైన 2025 మార్చి 31 వరకు పదవీ విరమణ పొందిన వారికి, పొందబోయే వారికి కూడా వర్తిస్తుందని క్యాబినెట్‌ కార్యదర్శిగా ఎంపికైన టీవీ సోమనాథన్‌ తెలిపారు. ఇందుకుగానూ వారు అందుకున్న పింఛన్‌, యూపీఎస్‌ ప్రకారం అందాల్సిన పింఛన్‌ను సర్దుబాటు చేసి బకాయి ఉంటే చెల్లించనున్నట్టు చెప్పారు.

Tags

Next Story