fighter jets Deal : 97 తేజస్ జెట్ల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్

సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా కవ్వింపు చర్యలకు దీటుగా సమాధానం చెప్పేందుకు భారత్ స్వదేశీ అస్త్రాలను సిద్ధం చేస్తోంది. శత్రు దేశాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు 97 "తేజస్ " తేలికపాటి యుద్ధ విమానాలు, 156 ప్రచండ్ హెలికాప్టర్లను సైన్యం, వాయుసేన అమ్ములపొదిలోకి చేర్చుతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తేజస్ యుద్ధ విమానాలు, ప్రచండ్ హెలికాప్టర్లు శత్రు దేశాలకు సింహ స్వప్నంలా నిలవనున్నాయి.
సరిహద్దుల్లో పాక్, చైనా కవ్వింపు చర్యలకు చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తున తేజస్ యుద్ధ విమానాలు, ప్రచండ్ హెలికాప్టర్లు సైన్యంలోకి చేరనున్నాయి. ఇందులో ముఖ్యంగా అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో శత్రు లక్ష్యాలపై దాడులు చేసే ప్రచండ్ హెలికాప్టర్లు భారత సైన్యానికి కీలక సేవలందించనున్నాయి. కఠిన పరిస్థతులుండే సియాచిన్ వంటి చోట ప్రచండ్ హెలికాప్టర్లు ఒకటి కన్నా ఎక్కువ ఆపరేషన్‌లలో పాల్గొంటాయని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు. తేలికగా ఉండే ఈ హెలికాప్టర్లు వేగంగా శత్రు లక్ష్యాలపై దాడులు చేస్తాయని వివరించారు.
కార్గిల్ యుద్ధం తర్వాత వేగంగా, తేలికగా ఉండి సేలందించే హెలికాప్టర్ల అవసరం ఏర్పడింది. దేశీయంగా తయారైన ఈ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్( ప్రచండ్) దేశ సైనిక సామర్థ్యాలకు మరింత బలాన్ని చేకూర్చింది. తొలుత 10 ఎల్‌సీహెచ్ హెలికాప్టర్లు భారత సైన్యంలోకి చేరాయి. అవి వాటి పనితనాన్ని బాగా చూపించాయి. ఎత్తైన ప్రదేశాల్లోనూ ఇవి ఒకటి కన్నా ఎక్కువగా ఆపరేషన్‌లలో పాల్గొనగలవు. అటాక్ హెలికాప్టర్లను దిగుమతి చేసుకోవాల్సిన పనిలేదని నేను అనుకుంటున్నాను. ఈ 156 ఎల్‌సీహెచ్ హెలికాప్టర్లు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌కు సేవలందించగలవని భావిస్తున్నాను.
156 ప్రచండ్ లైట్ కొంబాట్ హెలికాప్టర్లలో 90 ఆర్మీకి సేవలందించనుండగా 66 వాయుసేనలోని చేరనున్నాయి. ప్రచండ్ హెలికాప్టర్లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అందించనుంది. 5.8 టన్నుల బరువుండే ఈ యుద్ధ హెలికాప్టర్లు రెండు ఇంజిన్లను కలిగి ఉంటాయి. శత్రుల ట్యాంకులు, బంకర్లు, డ్రోన్లు ఇతర ఆయుధాలను సమర్థంగా కూల్చగల శక్తి వీటి సొంతం. ఆధునిక ప్రమాణాలు కలిగిన ప్రచండ్ హెలికాప్టర్లు రాత్రివేళ కూడా వేగంగా దాడులు చేయగలుగుతాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రమైన సియాచిన్‌లోనూ ఈ హెలికాప్టర్లు సేవలందించగలవు.
సాయుధ బలగాలను మరింత బలోపేతం చేసే దిశగా గురువారం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 97 "తేజస్ " తేలికపాటి యుద్ధవిమానాలు, 156 ప్రచండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు పచ్చజెండా ఊపింది. దీంతోపాటు వాయుసేనకు చెందిన 84 ‘సుఖోయ్-30’ యుద్ధవిమానాల అభివృద్ధి ప్రణాళికకూ ప్రాథమిక ఆమోదం తెలిపింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ -DAC ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయా ఒప్పందాల విలువ దాదాపు రూ 2.23 లక్షల కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com