మళ్లీ మొదటికే..లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోనే ఢిల్లీ అధికారాలు

ఢిల్లీసర్కార్, కేంద్రం మధ్య వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ఢిల్లీలో పాలనాధికారం ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో కేంద్రం కొత్త ఆర్డినెన్స్ తెచ్చింది. నగర పాలనపై అసాధారణ అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో పెడుతూ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఢిల్లీలో గ్రూప్-ఏ అధికారుల పోస్టింగ్, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను తొలగిస్తూ.. దాని స్థానంలో కొత్తగా నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ అనే ఓ కమిటీని ఏర్పాటుచేసింది. అయితే ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వ నియంత పోకడే అంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు
కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌తో ఢిల్లీలో గ్రూప్ -ఏ తోపాటు డీఏఎన్‌ఐసీఎస్ అధికారుల పోస్టింగ్‌లు, బదిలీలపై ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాలు పూర్తిగా రద్దయ్యాయి.ఇక ఢిల్లీలోని అధికారుల పోస్టింగ్, బదిలీలతోపాటు విజిలెన్స్ అధికారాలు ఎల్జీ చేతిలోకి వెళ్లాయి. నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ పేరుతో ఓ కమిటీని ఏర్పాటుచేస్తారు. దీనికి చైర్మన్‌గా ఢిల్లీ సీఎం ఉంటారు. మెంబర్లుగా సీఎస్,హోంశాఖ కార్యదర్శి ఉంటారు. ఢిల్లీలో ఏ అధికారిని బదిలీ చేయాలన్నా, పోస్టింగ్ ఇవ్వాలన్నీ ఈ ముగ్గురు సమావేశమై, ఓటింగ్ నిర్వహించి ఎల్జీకి నివేదించాలి. నగరంలోని పోలీస్ వ్యవస్థ మొత్తం ఇప్పటికే ఎల్జీ చేతిలో ఉంది. దేశ రాజధానిలో శాంతిభద్రతల బాధ్యత మొత్తం ఎల్జీదే. సివిల్ అధికారులపై ప్రభుత్వానికి అజమాయిషీ ఉండేది. తాజా ఆర్డినెన్స్‌తో ఢిల్లీ ప్రభుత్వానికి ఆ అధికారాలు కూడా లేకుండా పోయాయి.
ఇక ఢిల్లీలో ఎవరి అధికారాలు ఏంటన్న దానిపై 2015 నుంచి వివాదం నడుస్తున్నది. కేంద్రంలో మోదీ సర్కార్ ఏర్పడగానే ఢిల్లీ పాలనా ధికారాలను మొత్తం ఎల్జీ చేతిలో పెట్టింది. అప్పుడే కొత్తగా ఏర్పడిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని డమ్మీని చేసేందుకే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకొన్నదన్న విమర్శలు వినిపించాయి. కేంద్రం నిర్ణయంపై కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లటంతో.. కోర్టు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో కేజ్రీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ వివాదాన్ని విచారించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. ఎల్జీ, ఎన్నికైన ప్రభుత్వం మధ్య స్పష్టమైన అధికారాల విభజనను సూచిస్తూ ఈ నెల 11న తీర్పు ఇచ్చింది. నగరంలో శాంతిభద్రతల బాధ్యత మాత్రమే ఎల్జీదని, ఇతర శాసన, కార్యనిర్వాహక బాధ్యతలు ఎన్నికైన ప్రభుత్వానికే చెందుతాయని తీర్పు ఇచ్చింది.
అయితే సుప్రీం తీర్పు వచ్చి వారం కాక ముందే కొత్త ఆర్డినెన్స్ తెచ్చింది కేంద్రం.దీంతో శాంతిభద్రతలతోపాటు కార్యనిర్వాహక అధికారాలు కూడా ఎల్జీ చేతుల్లోకే వెళ్లిపోయాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా నగరంలో అధికారాల సమతుల్యం కోసమే ఈ ఆర్డినెన్స్ తెచ్చామని కేంద్రం ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com