One Nation-One Election: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం

జమిలి ఎన్నికల కోసం గత కొంతకాలంగా కసరత్తులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే దేశం-ఒకే ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. సెప్టెంబరులో ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటన వెలువడిన మరుసటి రోజే జమిలి ఎన్నికల కోసం కేంద్రం. కమిటీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిణామాలతో సార్వత్రిక ఎన్నికలు ముందుకు జరగనున్నాయనే ఊహాగానాలతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ఆలోచనను కొన్నేళ్లుగా బలంగా ప్రచారం చేస్తున్న మోదీ సర్కారు దీన్ని అమల్లోకి తెచ్చేలా కార్యాచరణ చేపట్టింది. ఈ బాధ్యతను మాజీ రాష్ట్రపతి కోవింద్‌కు అప్పగించింది. ఒకే దేశం-ఒకే ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ప్యానెల్ సభ్యులపై త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ పరిశీలించి, నిపుణులు, పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశాలు జరపనుంది. 2017లో రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత జమిలీ ఎన్నికలపై మోదీ ఆలోచనకు అప్పట్లో రామ్‌నాథ్ కోవింద్ మద్దతు తెలిపారు.
తరచుగా జరిగే ఎన్నికల వల్ల మానవ వనరులపై భారీ భారం పడుతోందని, అభివృద్ధి ప్రక్రియకు ఎన్నికల కోడ్ ఆటంకం కలిగిస్తోందని అన్నారు. జమిలీ ఎన్నికలపై అన్ని పార్టీల్లోనూ ఏకాభిప్రాయం కుదురుతుందని కోవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఈ అంశంపై చర్చించే కంటే నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశం భాజపా అగ్ర నాయకత్వంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ముందుకు జరిగి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ ఏడాది చివర్లలో మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇక సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఇవన్నీ ముందుకు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎన్డీఏలో భాగం కాకపోయినా ఆంధ్రప్రదేశ్, ఒడిశా సీఎంలతో ప్రధాని మోదీకి మంచి సంబంధాలు ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉండగా, సిక్కింలో మిత్రపక్షం, మహారాష్ట్ర, హరియాణాలో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్నాయి. ఝార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక లోక్‌సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో కలిసే ముందస్తుగా జరిగే అవకాశాలు లేకపోలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com