RBI: రూ.500 దొంగ నోట్లు.. తస్మాత్ జాగ్రత్త

ఇటీవల కాలంలో నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. కొందరు రూ.500 నకిలీ నోట్లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వైన్ షాపులో కేవలం నెల రోజుల వ్యవధిలో రెండు రూ.500 నోట్లు వచ్చాయి. బ్యాంకులో నగదు జమ చేసేందుకు వెళ్లినప్పుడు ఆ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా రూ.500 దొంగ నోట్లు చెలామణిలోకి వచ్చినట్లు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యాధునిక టెక్నాలజీ వాడి తయారుచేసిన రూ.500 దొంగ నోట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ సమాచారాన్ని డీఆర్‌ఐ, ఎఫ్‌ఐయూ, సీబీఐ, ఎన్‌ఐఏ, సెబీతో కూడా పంచుకుంది. రూ.500 దొంగ నోట్ల ప్రింటింగ్, నాణ్యత చాలావరకు అసలు నోట్లులాగే ఉన్నట్లు పేర్కొంది. వాటిని గుర్తించడం కూడా చాలా క్లిష్టంగా మారిందని వెల్లడించింది.
రూ.500 దొంగ నోట్‌లో స్పెల్లింగ్ తప్పు
మార్కెట్లలో చెలామణీ అవుతున్న రూ.500 దొంగ నోట్లలో ఒక చిన్న స్పెల్లింగ్ తప్పు ఉందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. దీనిని గుర్తించడంలో అదే కీలకమని పేర్కొంది. 'RESERVE BANK OF INDIA' అనే దానిలో 'RESERVE' పదంలో 'E' బదులు 'A' పడినట్లు వెల్లడించింది. ఈ చిన్న తప్పును గుర్తించాలంటే ఆ నోటును క్షుణ్ణంగా పరీక్షించాల్సి ఉంటుంది. ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని తెలిపింది. దొంగ నోట్ల విషయంలో ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఏజెన్సీలను అప్రమత్తంగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రజలు, వ్యాపార సంస్థలు అప్రమత్తం
ఇప్పటికే ఈ నకిలీ నోట్లు పెద్ద సంఖ్యలో మార్కెట్లోకి చేరిపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మార్కెట్లో మొత్తం ఎన్ని దొంగ నోట్లు ఉన్నాయో గుర్తించడం కష్టమని ఉగ్రవాదానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలపై దర్యాప్తు నిర్వహిస్తున్న ఓ అధికారి తెలిపారు. ఈ విషయంలో ప్రజలు, వ్యాపార సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com