Delhi High Court: ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గింపు ? ...

ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గించే అంశం పై వివరణాత్మక స్పందన తెలియజేసేందుకు కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు 10 రోజుల గడువు విధించింది. దేశ రాజధానిలో గాలి నాణ్యత క్షీణిస్తున్నందున ఎయిర్ ప్యూరిఫైయర్లను వైద్య పరికరంగా పరిగణించి.. వాటిని 5శాతం జీఎస్టీ శ్లాబులోకి తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై నేడు మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి ఈ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
నేటి విచారణ సందర్భంగా కేంద్రం తీరుపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఎయిర్ ప్యూరిఫైయర్ల ధర రూ.10-15వేలు ఉందని.. సామాన్యులు అంత డబ్బు పెట్టి ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించింది. దీనిపై నిర్ణయం తీసుకోవడంలో జీఎస్టీ మండలికి ఇబ్బందేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం కేంద్రం తరఫు న్యాయవాది వాదిస్తూ.. పిటిషనర్ తన వ్యాజ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖను ప్రస్తావించకపోవడాన్ని తప్పుబట్టారు. ఈ పిటిషన్ ద్వారా ఎవరికి ప్రయోజనం చేకూర్చాలనుకుంటున్నారో తెలియట్లేదని.. పిటిషన్ ఉద్దేశం గురించి తెలుసుకోవడానికి అనేక విషయాలపై దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
అంతేగాక, జీఎస్టీ తగ్గింపు అంశంపై చర్చించాలంటే జీఎస్టీ కౌన్సిల్ వ్యక్తిగతంగా సమావేశమవ్వాలని.. వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కేంద్రం తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీనిపై స్పందించేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో న్యాయస్థానం కేంద్రానికి పది రోజుల సమయం ఇచ్చింది.
చనిపోతున్నా స్పందించరా?
అంతకుముందు.. దేశ రాజధాని నగరం ఢిల్లీ సహా చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న వేళ.. ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18 శాతం జీఎస్టీ కొనసాగిస్తుండటంపై హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ గాలి శుద్ధి యంత్రాలపై జీఎస్టీ తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నిస్తూ.. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జీఎస్టీ కౌన్సిలు తక్షణం సమావేశమై గాలిశుద్ధి యంత్రాలపై పన్ను తగ్గించడం లేదా పూర్తిగా రద్దు చేయడంపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ‘‘మనం రోజుకు 21 వేల సార్లు శ్వాస తీసుకుంటాం. అలాంటప్పుడు గాలి కాలుష్యం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఓసారి లెక్కించండి’’ అని వ్యాఖ్యానించింది. పిటిషనుపై స్పందించేందుకు గడువు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘వాయు కాలుష్యం ప్రాణాంతకంగా మారింది. వేల సంఖ్యలో ప్రజలు చనిపోయిన తర్వాత స్పందిస్తారా? ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన గాలి అవసరం. అది అందించలేనప్పుడు కనీసం శుద్ధి యంత్రాలనైనా అందుబాటు ధరల్లో ఉంచాలి కదా! ఇలాంటి ఎయిర్ ఎమర్జెన్సీలో జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద తాత్కాలిక పన్ను మినహాయింపును తక్షణం ఎందుకు ఇవ్వకూడదు?’’ అని కేంద్రంపై ప్రశ్నలు కురిపించింది. ప్రజల ప్రాణాల కంటే పన్నులే ముఖ్యమా? అంటూ ప్రశ్నించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

