Agnipath: అగ్నిపథ్‌లో కేంద్రం కీలక మార్పులు!

Agnipath: అగ్నిపథ్‌లో కేంద్రం కీలక మార్పులు!
మోదీ సర్కార్‌ దిద్దుబాటు చర్యలు..

వివాదాలకు దారితీసిన ‘అగ్నివీర్‌ పథకం’పై మోదీ సర్కార్‌ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అర్హతలు, పారితోషకాలతోపాటు, మరికొంతమంది అగ్నివీర్లను సర్వీస్‌లో కొనసాగించేలామార్పులు ఉండబోతున్నాయని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. పథకం మరింత మెరుగుకు అవసరమైన సవరణలు చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ‘25శాతం మందికి ఫుల్‌టైమ్‌ సర్వీస్‌ ఇవ్వటం.. క్షేత్రస్థాయిలో ఉన్న డిమా ండ్‌కు సరిపోదు. నాలుగేండ్ల శిక్షణ తర్వాత అగ్నివీర్లలో 50శాతం మందిని ఫుల్‌టైమ్‌ సర్వీస్‌కు ఎంపికచేయాలని సైన్యం సిఫారసు చేసింది’ అని రక్షణ శాఖ తెలిపింది. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సైన్యం తన సిఫారసులను అందజేసినట్టు తెలిసింది.

లోక్‌సభ ఎన్నికలల్లో ప్రతిపక్షాలకు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారిన అంశాల్లో అగ్నిపథ్‌ పథకం ఒకటి. త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంపై అప్పట్లో యువత నుంచి పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఎన్డీయేలో కీలక భాగస్వామి జేడీయూ.. ‘అగ్నిపథ్‌’ను సమీక్షించాలని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. మిత్రపక్షం డిమాండ్లు, విపక్షం విమర్శల వేళ.. ఈ పథకంలో మార్పులు చేసే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. రక్షణశాఖ అధికారులను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనం వెల్లడించింది.

ప్రస్తుతం అగ్నిపథ్‌ పథకం నిబంధనల ప్రకారం.. అగ్నివీరులుగా ఎంపికైనవారు నాలుగేళ్ల తర్వాత విధుల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. వారిలో 25 శాతం మందిని మాత్రమే కొనసాగించి, శాశ్వత సర్వీసుల్లోకి తీసుకుంటారు. అయితే, ఇప్పుడు ఆ సంఖ్యను పెంచేదిశగా చర్చలు జరుగుతున్నట్టు రక్షణశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. నాలుగేళ్ల తర్వాత 50 శాతం మంది అగ్నివీరులను సైన్యంలో కొనసాగించాలని, వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచాలని సైన్యం సిఫార్సు చేసిందని తెలిపారు. అలాగే జీతభత్యాల్లో మార్పులు చేయొచ్చని సమాచారం.

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో నియామకాలకు సంబంధించి జూన్‌ 2022లో అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 17 నుంచి 21 ఏళ్ల వయసున్న యువతీ యువకులు మాత్రమే అగ్నివీర్‌లుగా చేరడానికి అర్హులని కేంద్రం పేర్కొంది. ఈ పథకం కింద త్రివిధ దళాల్లో చేరినవారిలో కేవలం 25 శాతం మందినే శాశ్వతంగా సర్వీసుల్లో కొనసాగిస్తారు. సర్వీస్‌ నుంచి తప్పుకొన్న 75 శాతం అగ్నివీర్‌లకు మాజీ సైనికులకు దక్కే సౌకర్యాలు ఉండవు.


Tags

Next Story