India Fuel Prices: అంతర్జాతీయంగా ముడిచమురు మంట.. కానీ ..

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్యారెల్ ధర 110 డాలర్లను దాటినప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే పెంచే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో సామాన్య ప్రజలకు భారీ ఊరట లభించినట్లయింది. ప్రస్తుతానికి ఈ భారాన్ని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) భరించాలని, రిటైల్ ధరలను యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి వద్ద సరఫరాకు అంతరాయాలు ఏర్పడటంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 28 శాతం పెరిగి 116 డాలర్లకు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) 27 శాతం పెరిగి 116 డాలర్లకు చేరుకుంది. 2022 తర్వాత ఈ రెండు బెంచ్‌మార్క్‌లు 100 డాలర్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి. సాధారణంగా అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మన దేశంలో ఇంధన ధరలను సవరిస్తుంటారు. కానీ, మార్కెట్‌లో తీవ్రమైన ఒడుదొడుకులు ఉన్నప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని, చమురు కంపెనీల ద్వారా వినియోగదారులపై భారం పడకుండా చూస్తుంది.
దేశంలో ఇంధన నిల్వల పరిస్థితి మెరుగుపడుతుండటం, సరఫరాలు స్థిరంగా ఉండటంతో ధరలను నియంత్రించగలమన్న విశ్వాసాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. హోర్ముజ్ జలసంధి మార్గంపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గతంలో ఈ మార్గం వెలుపల నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు 60 శాతం ఉండగా, ఇప్పుడు దానిని 70 శాతానికి పెంచుకుంది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధి నుంచి ఒక కార్గో షిప్ బయలుదేరిందని, సరఫరాలు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తున్నాయని అధికారులు తెలిపారు.
అయితే, మధ్యప్రాచ్యంలో యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే, గల్ఫ్ దేశాలు సరఫరాలను నిలిపివేసే ప్రమాదం ఉందని, అప్పుడు ముడిచమురు ధర బ్యారెల్‌కు 150 డాలర్లకు, సహజవాయువు ధర 40 డాలర్లకు చేరుకోవచ్చని ఖతార్ ఇంధన శాఖ మంత్రి హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ అణు ముప్పును ఎదుర్కోవడంలో భాగంగా చమురు ధరల పెరుగుదల అనేది తాత్కాలికమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఏదేమైనా, ప్రస్తుతానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారతీయ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడటం లేదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
