CEO Killed Son In Goa : లేడీ CEO కేసులో షాకింగ్ నిజాలు

నాలుగేళ్ల కుమారుడిని కిరాతకంగా చంపిన సాఫ్ట్‌వేర్ సంస్థ సీఈవో సుచనా సేఠ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో తలదిండు, లేదా టవల్‌తో బాలుడి గొంతునులిమి హతమార్చినట్లు తేలింది. ఈ హత్య పక్కా ప్రణాళికతోనే జరిగిందనడానికి పోలీసులకు పలు ఆధారాలు లభించాయి. మరోవైపు కుమారుడితో భర్త వారాంతంలో ఉండేందుకు అనుమతించడమే హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నాలుగేళ్ల కుమారుడిని చంపి, లగేజీ బ్యాగులో మృతదేహాన్ని తరలిస్తూ పోలీసులకు చిక్కిన మైండ్‌ఫుల్ ఏఐ సంస్థ సీఈవో సుచనా సేఠ్ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త వెంకటరత్నం తన కుమారుడితో గడిపేందుకు కోర్టు అనుమతించడమే హత్యకు దారితీసిందని గోవా పోలీసులు తెలిపారు. 2022లో దంపతుల విడాకుల ప్రక్రియ ప్రారంభమైంది. కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే దానిపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో భర్త ప్రతీ ఆదివారం కుమారుడితో ఉండేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఈ ఉత్తర్వులు.. సుచనాసేఠ్‌ను తీవ్ర నిరాశకు గురిచేశాయి. అందుకే బాలుడిని చంపాలని నిర్ణయం తీసుకుందని పోలీసులు చెప్పారు. ఈ కేసులో సుచనాను మరింత విచారించేందుకు ఆమెను గోవా కోర్టు.. 6 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.
మరోవైపు.. నాలుగేళ్ల కుమారుడిని సుచనా సేఠ్ ఎలా చంపిందో పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. బాలుడికి ఊపిరి ఆడకుండా చేసి చంపిందని తెలిసింది. చేతితో కాకుండా టవల్ లేదా తలదిండుతో బాలుడి గొంతు నులిమినట్లు పోస్టుమార్టం నిర్వహించిన హిరియుర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం చేసిన సమయానికి 36 గంటల ముందు బాలుడు చనిపోయినట్లు చెప్పారు. బాలుడి శరీరం నుంచి రక్తం బయటకు రాలేదనీ.. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని చెప్పారు. బాలుడి హత్య పక్కా ప్రణాళికతోనే జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. బాలుడికి ఎక్కువ పరిణామంలో దగ్గుమందు ఇచ్చి తర్వాత హత్యకు పాల్పడి ఉండొచ్చని చెప్పారు. హోటల్ రూంలో తనిఖీలు నిర్వహించగా.. ఒక పెద్ద, ఒక చిన్న దగ్గుమందు బాటిల్స్ కనిపించినట్లు తెలిపారు. తనకు దగ్గు వస్తోందనీ.. ఒక సిరప్ బాటిల్ కొనితేవాలని హోటల్ సిబ్బందికి సుచనాసేఠ్ కోరినట్లు తేలిందన్నారు. అంతకుముందే పెద్ద డబ్బాలోని సిరప్‌ను బాలుడికి ఇచ్చి ఉంటుందని భావిస్తున్నారు. అయితే విచారణలో మాత్రం తాను ఈ హత్య చేయలేదనీ నిద్ర నుంచి లేచేసరికే కుమారుడు చనిపోయి ఉన్నాడని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని అతడి తండ్రికి అప్పగించారు. బెంగళూరులోని ఓ అపార్టుమెంటుకు మృతదేహాన్ని తరలించారు,
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com