PM Modi: రాహుల్‌ ‘శక్తి’ వ్యాఖ్యలకు మోదీ జవాబు

PM Modi: రాహుల్‌ ‘శక్తి’ వ్యాఖ్యలకు మోదీ జవాబు
ఆ సవాల్‌ను స్వీకరిస్తున్నా..

ముంబయిలో విపక్ష కూటమి ఇండియా నేతలు హాజరైన సభలో శక్తి పేరిట కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హిందూ ధర్మంలో శక్తి అనే శబ్ధం ఉంటుందని, ఓ శక్తితో తాము పోరాడుతున్నామని రాహుల్‌ వ్యాఖ్యానించగా ప్రధాని మోదీ ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజలంతా పూజించే శక్తిని నాశనం చేయడమే విపక్ష కూటమి ఇండియా మేనిఫెస్టో అని మోదీ విమర్శించారు. ఎన్నికల సమరంలో శక్తిని పూజించే వారిది విజయమో లేదా శక్తిని నాశనం చేసేవారిది విజయమే జూన్‌ 4వ తేదీన తేలుతుందన్నారు.

ముంబయిలో జరిగిన విపక్ష కూటమి ఇండియా సభలో మాట్లాడిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ శక్తి పేరిట చేసిన విమర్శలు ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీశాయి. ఓ శక్తితో తాము పోరాడుతున్నామన్న రాహుల్‌...విపక్ష పార్టీల్లో ఉన్న నేతను ఆ శక్తి బలవంతంగా భాజపాలోకి తీసుకెళ్తోందని విమర్శించారు.

శక్తి అని పదాన్ని ఉపయోగించి రాహుల్‌ చేసిన విమర్శలపై భాజపా నేతలు మండిపడుతున్నారు. అందరూ పూజించే శక్తిని నాశనం చేస్తామని ఇండియా కూటమి మేనిఫెస్టో చెబుతోందని తెలంగాణలోని జగిత్యాలలో జరిగిన సభలో ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల సమరాన్ని శక్తిని పూజించే వారు, శక్తిని నాశనం చేసేవారి మధ్య యుద్ధంగా అభివర్ణించారు. శక్తిని నాశనం చేయాలనుకునేవారు నెగ్గుతారో లేదా శక్తిని పూజించే వారు నెగ్గుతారో ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్‌ 4వ తేదీన తేలుతుందని మోదీ అన్నారు.

కేంద్రం చేసిన పనులను మోదీ వివరిస్తూ.. 'రూ.6,400 కోట్లతో రామగుండం ఎరువులు ఫ్యాక్టరీని పునరుద్ధరించాం. పసుపు ధరను క్వింటాల్ కు రూ.6వేల నుంచి రూ.30 వేలకు పెంచాం. ఇక్కడి ప్రభుత్వాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయాయి. మళ్లీ అధికారంలోకి రాగానే వచ్చే పదేళ్ల తెలంగాణ ప్రగతిపై దృష్టి పెడతాం. తెలంగాణలో రైలు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేస్తాం' అని హామీ ఇచ్చారు.

'తెలంగాణలో బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్టుకుపోతాయి. మాకు అధికారం కాపుడుకోవడం కన్నా.. ప్రజల శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకోవడమే ముఖ్యం. మేం అధికారంలో ఉంటే.. ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల అవినీతిపై కేంద్రం విచారణ చేపడితే.. మోడీని తిట్టడం ప్రారంభిస్తున్నారు. తెలంగాణను దోచుకున్న వారిని మేము విడిచిపెట్టేది లేదు' అని స్పష్టం చేశారు. తమకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. జూన్ 4వ తేదీన ఎన్డీయేకు 400 సీట్లు దాటాలి అని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story