Chandraya-3 : మూడు లక్ష్యాల్లో రెండు పూర్తి..

Chandraya-3 : మూడు లక్ష్యాల్లో రెండు పూర్తి..
కీలక ప్రకటన చేసిన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించిన మూడు లక్ష్యాల్లో రెండు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని ఇస్రో ‘ఎక్స్’ సామాజిక వేదికలో ఓ పోస్ట్ పెట్టింది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం, జాబిల్లి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ సంచరించడం దిగ్విజయంగా పూర్తయ్యిందని తెలిపింది.

చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ తో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించింది. ఇప్పటి వరకూ ఏ దేశం అడుగుపెట్టని చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ను ల్యాండింగ్ చేసి.. అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కాని అద్భుతాన్ని సృష్టించింది. 100శాతం సక్సెస్‌ రేట్‌తో తన విజయాల పరంపరను కొనసాగిస్తోంది. ల్యాండర్‌, రోవర్‌ తమ పనిని తాము చక్కగా చేసుకుపోతున్నాయి. ఏ టైమ్‌కి ఏం చేయాలో అదే చేస్తూ ఇస్రో సైంటిస్టుల ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. తమ ఆనందాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ట్వీట్స్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. మొత్తం మూడు లక్ష్యాలలో రెండు టార్గెట్లను సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్‌ చేసింది చంద్రయాన్‌-3. జాబిల్లి ఉపరితలంపై సురక్షితమైన, సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్, చంద్రునిపై తిరిగే రోవర్ ప్రదర్శన సక్సెస్ అవ్వగా.. అటు పేలోడ్‌లు సాధారణంగా పని చేస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇస్రో ట్వీట్ చేసింది.

దీనికి ముందు జాబిల్లి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్‌ తిరుగుతున్న మరో వీడియోను విడుదల చేసింది. విక్రమ్ ల్యాండర్ నుంచి ర్యాంప్ తెరుచుకుని.. అందులో నుంచి ఉపరితలంపైకి రోవర్‌ చేరుకోవడం వీడియో కనిపించింది. సూర్యకాంతికి బూడిదవర్ణంలో మెరిసిపోతున్న చంద్రుడి మట్టిపై విస్పష్టంగా తన చక్రాల ముద్రను నిక్షిప్తం చేసింది. ఈ రోవర్‌ 8 మీటర్లు ప్రయాణించినట్లు ఇస్రో ఇప్పటికే వెల్లడించింది.


చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ దిగిన ప్రదేశానికి.. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ‘శివశక్తి పాయింట్‌’ అని పేరు పెట్టారు. బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలను కలిసి, అభినందించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. ఇస్రో వీడియో విడుదల చేస్తూ.. ‘చంద్రుడి రహస్యాలను అన్వేషించేందుకు ప్రజ్ఞాన్ రోవర్‌.. శివశక్తి పాయింట్‌ వద్ద చక్కర్లు కొడుతోంది’ అని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story