CHANDRAYAN-3: విక్రమా... పరాక్రమించరా..

కోట్లాది మంది భారతీయులు సహా ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న చారిత్రక క్షణాలు చేరువయ్యాయి. చందమామ దక్షిణ ధ్రువంపై భారత కీర్తి పతాకను సగర్వంగా(national pride) ఎగిరేసే చారిత్రక ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. ఇప్పటివరకూ ఏ దేశమూ సాధించని అరుదైన ఘనతను సాధించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో( ISRO) సిద్ధమైంది. జులై 14న నింగికెగిసిన చంద్రయాన్-3(Chandrayaan-3) 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు సిద్ధమవుతోంది. ఈ చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచేందుకు యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
చంద్రయాన్ -2 మిషన్ లో విక్రమ్ ల్యాండర్‌ను జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో విఫలమైన ఇస్రో ఈసారి ఆ పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంది. ఈసారి ఎన్ని సమస్యలు ఎదురైనా చంద్రునిపై ల్యాండర్( moon mission) సురక్షితంగా, మృదువగా దిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అమెరికా, రష్యా, చైనా లాంటి అంతరిక్ష దిగ్గజాలకు అందని ద్రాక్షగా ఉన్న చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి సరికొత్త చరిత్ర లిఖించడం ఖాయమని ఇస్రో కృతనిశ్చయంతో ఉంది.
చంద్రయాన్-2తో జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయం అందినట్టే అంది చేజారినా పట్టు వదలకుండా చంద్రయాన్-3ను సిద్ధం చేసింది. లోపాలను సవరించుకుని వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని చంద్రయాన్-3లో అన్ని ఏర్పాట్లు చేసింది. 2023 జులై 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది. ఆగస్టు 5 నుంచి చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకపోతే అన్నీ అనుకున్నట్లుగా జరిగితే నేటి సాయంత్రం సరిగ్గా 6 గంటల 4 నిమిషాలకు చంద్రయాన్-3 జాబిల్లి ఉపరితలంపై కాలు మోపనుంది.
చంద్రయాన్ విక్రమ్ ల్యాండర్ 2 మీటర్ల ఎత్తు ఉంటుంది. దాని బరువు 17 వందల కిలోలు. ఈ ల్యాండర్‌లోని గదిలో ప్రజ్ఞాన్ రోవర్ 26 కిలోల బరువు ఉంటుంది. విక్రమ్ ల్యాండర్..చంద్రుడికి చేరువయ్యే కొద్దీ అక్కడ ఉన్న జాబిల్లి చిత్రాలను ఫొటో తీసి ఇస్రోకు పంపుతోంది. ల్యాండర్ మాడ్యూల్‌లోని ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా చిత్రీకరించిన చందమామ దక్షిణ ధ్రువం ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ క్షేమంగా కాలు మోపడానికి ఈ కెమెరా తోడ్పడనుంది. రాళ్లు, గుంతలను ఫొటో తీసి అవి లేని చోట ల్యాండర్ దిగడానికి అనువైన ప్రదేశాన్ని ఈ కెమెరా గుర్తిస్తుంది.
చంద్రయాన్-3 బరువు 3,900 కేజీలు. దీన్ని తయారు చేసేందుకు 75 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. అంటే మన కరెన్సీలో 615 కోట్ల రూపాయలు(costing more than Rs 615 crores). చంద్రయాన్-3 బడ్జెట్ హాలీవుడ్ సినిమాల బడ్జెట్‌తో పోలిస్తే చాలా తక్కువ. 2009లో విడుదలైన హాలీవుడ్ చిత్రం అవతార్ బడ్జెట్... దాదాపు 1970 కోట్ల రూపాయలు కాగా... చంద్రయాన్-3 మొత్తం బడ్జెట్ రూ.615 కోట్లు. అంటే అవతార్ సినిమా ఖర్చులోని మూడో వంతు మొత్తంతో చంద్రయాన్-3ని చంద్రునిపైకి పంపడంలో భారత్ విజయం సాధించిందని పలువురు కొనియాడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com