Chandrayan 3 : టూర్ కి రెడీ..
చంద్రయాన్ 3 ప్రయోగానికి అంతా సిద్ధంగా ఉన్నట్లు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ తెలిపారు. ఈ లాంచ్ జూలై 12 నుండి 19 మధ్యన చేపట్టనున్నట్లు చెప్పారు. అన్ని టెస్టులు పూర్తయ్యాక కచ్చితమైన తేదీని ప్రకటిస్తామన్నారు. ఉపగ్రహం అనుసంధానం, రోవర్, ల్యాండర్ బిగింపు పనులు కూడా పూర్తయినట్లు తెలిపారు.
చంద్రయాన్ 3 ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.615 కోట్లు కేటాయించింది. ఇది చంద్రునిపైకి వెళ్లే భారత్ కు చెందిన అత్యంత బరువైన రాకెట్. చంద్రయాన్ 1 ను 2008లో చేపట్టారు. అది విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలను గుర్తించింది. 2019లో చంద్రయాన్ 2ను చేపట్టారు. ఈ రెండో మిషన్ విఫలమైంది. మునుపటి లోపాలను సవరించుకుని ఇప్పుడు చంద్రయాన్ 3ను ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ ప్రయోగం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సైంటిస్టులు తుది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చంద్రుడిపైకి రోవర్‌ను పంపించి, అక్కడి వాతావరణ, భౌగోళిక పరిస్థితులను తెలుసుకోవడ మే ఈ మిషన్ లక్ష్యం. చంద్రయాన్–3 స్పేస్‌క్రాఫ్ట్‌ను జీఎస్‌ఎల్‌వీ–ఎంకే–3 రాకెట్ ద్వారా చందమామపైకి పంపించనున్నారు. చంద్రయాన్–3 మిషన్‌ను ఎలా అయినా సఫలం చేయాలని, చంద్రుడిపై ప్రయో గాల్లో మనదైన ముద్ర వేయాలని ఇస్రో సైంటిస్టులు అహోరాత్రులూ శ్రమిస్తున్నారు. భవిష్యత్తులో మనుషులను చంద్రుడిపైకి పంపించడానికి ఈ ప్రయోగం కీలకం అవుతుందనడంలో సందేహం లేదు.
నిజానికి చంద్రయాన్–2 ప్రయోగం దేశ ప్రజలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అందుకే చంద్రయాన్–2 కంటే విభిన్నంగా, వినూత్నంగా చంద్రయాన్–3 ప్రయోగానికి సిద్ధం అయ్యారు శాస్త్రవేత్తలు.
ఆర్బిటార్, మిషన్ కంట్రోల్ సెంటర్‌తో సమన్వయం చేసుకుంటూ పనిచేసే ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరాలు రెండు ఇందులో అమర్చుతున్నారు. చంద్రుడిపై ల్యాండర్ భద్రంగా దిగడానికి ఇవి ఉపకరిస్తాయి.
అలాగే చంద్రయాన్–3 లోని ప్రొపల్షన్ మాడ్యూల్‌లో ఉన్న స్పెక్ట్రో–పోలారీమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్(ఎస్‌హెచ్‌ఏపీఈ) అనే పేలోడ్ ఇతర గ్రహాలపై మానవ నివాస యోగ్యమైన ప్రదేశాల అన్వేషణకు అవసరమైన సమాచారాన్ని ఈ పరికరం అందజేస్తుంది.
ఇందులో ల్యాండర్‌తోపాటు లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ అరే ను సైతం పంపించ బోతున్నారు. జాబిల్లిపై పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది.
ఇందులో జీఎస్‌ఎల్‌వీ ఎంకే–3 రాకెట్‌లో ల్యాండర్, రోవర్ మాత్రమే కొత్తవి. చంద్రయాన్–2లో ప్రయోగించిన ఆర్బిటార్‌నే ఈ తాజా ప్రయోగంలోనూ ఉపయోగించుకుంటారు. ఈ ఆర్బిటార్ ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో క్షేమంగా ఉంది. సమాచారం ఇచి్చపుచ్చుకోవడానికి, ఉపరితలంపై మ్యాపింగ్ కోసం ఆర్బిటార్‌ను వాడుకుంటారు.
ఒకసారి తేదీ, సమయం ఖారారైన తరువాత తేదీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ ప్రయోగం ప్రారంభించనున్నారు. అన్ని జాగ్రత్తగా పరిశీలించి, పర్యవేక్షిస్తున్న శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 విజయవంతం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనల్లో ఒక కీలకమైన మైలురాయి కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com