Chandrayaan-3: ఇకపై చంద్రుని కక్ష్యలో..

Chandrayaan-3: ఇకపై చంద్రుని కక్ష్యలో..
రాకెట్‌ను ట్రాన్స్ లూనార్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలు

చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం మొదలైంది. 18 రోజులుగా భూకక్ష్యల్లో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 మంగళవారం చంద్రుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ఈ వ్యోమనౌకను ట్రాన్స్‌ లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం చంద్రయాన్‌ త్రి వెళుతున్న మార్గాన్ని ట్రాన్స్‌ లునార్‌ ట్రాజెక్టరీ అంటారు. ఈ సందర్భంగా ‘‘చంద్రయాన్-3 విజయవంతంగా భూ కక్ష్యలను పూర్తి చేసుకుని చంద్రుడివైపు వెళుతోంది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్కింగ్‌లో పేరిజీ-ఫైరింగ్ దశ పూర్తయింది. దీన్ని విజయవంతంగా ట్రాన్స్ లూనార్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టాము, తదుపరి లక్ష్యం చంద్రుడి కక్ష్యలోకి వెళ్లడమే’’ అని ఇస్రో పేర్కొంది.

ఇస్రో ప్రణాళిక ప్రకారంఆగస్టు 5కు అది నేరుగా చంద్రుని కక్ష్యలైన లునార్‌ ఆర్బిట్‌ ఇన్సర్షన్‌లోకి ప్రవేశిస్తుంది. తరువాత ఆ కక్ష్యలను పూర్తి చేసుకుని చంద్రయాన్‌ త్రి లోని ల్యాండర్‌ జాబిలిపై ఆగస్టు 23న సాఫ్ట్‌ లాండింగ్‌ కానుందని ఇస్రో ధీమా వ్యక్తం చేస్తోంది. ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్-3 జులై 14న శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయాణం ప్రారంభించింది.


చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి భూమితో పోలిస్తే చాలా తేడాగా ఉంటుంది అలాగే వాతావరణం కూడా. అందుకే అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్దితుల్ని దాటుకుంటూ నౌక ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి చంద్రయాన్ 2 లో జరిగిన పొరపాట్లు మరోసారి జరగకుండా చంద్రుడి కక్షలో సవ్యంగా సాగడంతో పాటు చంద్రుడిపైకి సురక్షితంగా ల్యాండ్ కావడం కూడా సవాల్ గానే తీసుకున్నారు. భూమికీ, చంద్రుడికీ మధ్య దూరం 3.8 లక్షల కిలోమీటర్లు. ఇందులో ప్రతీ 1.2 లక్షల కిలోమీటర్ల ప్రయాణానికీ చంద్రయాన్-3కి పట్టే సమయం 51 గంటలు. అలాగే చంద్రయాన్ ప్రయాణించేది 3.6 లక్షల కిలోమీటర్ల నుంచి 4 లక్షల కిలోమీటర్ల మధ్యన కూడా ఉండొచ్చని అంచనా.

Tags

Read MoreRead Less
Next Story