Chandrayaan-3: మా పరిశ్రమ, మీ ప్రార్ధనల ఫలితమే ఇది - ఇస్రో చైర్మన్ సోమనాథ్

Chandrayaan-3: మా పరిశ్రమ, మీ ప్రార్ధనల ఫలితమే ఇది - ఇస్రో చైర్మన్ సోమనాథ్
దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు గర్వంగా ఉందని వ్యాఖ్య

కొన్ని సంవత్సరాల కల నిజం అయ్యింది. కోట్ల మంది హృదయాలు ఆనందంతో పొంగిపోయాయి. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఒక లానార్ డే అంటే మన భూమిపై 14 రోజులు ముగిసేలోపు రోవర్, ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై తిరుగుతాయి, ఎంతో అమూల్యమైన సమాచారాన్ని పంపించనున్నాయి.

చంద్రయాన్-త్రీ ప్రయోగం సఫలం కావడంతో చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ఇంతకు ముందు అమెరికా, రష్యా, చైనా సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది. భారత్ సత్తా ని ప్రపంచం గుర్తించింది. భారత్ శాస్త్రవేత్తలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.


విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగాక మొదట ల్యాండర్ లోని ఒకవైపు ప్యానెల్ తెరుచుకుంటుంది. ఆరు చక్రాలు ఉండే రోవర్‌ బయటకు రావడానికి వీలుగా ర్యాంప్ ఏర్పడుతుంది. నాలుగు గంటల తర్వాత ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. రోవర్ ప్రజ్ఞాన్‌లో భారత జాతీయ పతాకం, అలాగే, ప్రజ్ఞాన్ చక్రాలపై ఇస్రో లోగోలను ముద్రించారు. రోవర్ కదుతున్న సమయంలో చంద్రుడి ఉపరితలంపై భారత జాతీయ పతాకం, ఇస్రో లోగోల ముద్రలు పడతాయి. ఒక్క క్షణానికి ఒక సెంటీమీటర్ వేగం చొప్పున అది ముందుకు వెళ్తూ అక్కడి పరిసరాలను నేవిగేషన్ కెమెరాల ద్వారా స్కాన్ చేస్తుంది. .


ఆ కొద్ది నిమిషాలూ ఎలా గడిచాయి అంటే..

చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం గం.5.44 నిమిషాలకు ప్రారంభమైంది. చంద్రుడి ఉపరితలం వైపుగా విక్రమ్ ల్యాండర్ ప్రయాణం ప్రయాణిస్తోంది. ల్యాండర్ నుండి వస్తోన్న సిగ్నల్స్‌ను ఇస్రో శాస్ర్తవేత్తలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. బెంగళూరు కేంద్రంలో శాస్త్రవేత్తలు క్షణం క్షణం ఉత్కంఠతో పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.


అప్పుడు .. సరిగ్గా.. 6.04 నిమిషాలు ప్రపంచమంతా కన్నార్పకుండా చూస్తుండగా, భారతీయులంతా మునివేళ్లపై నిలబడి ఊపిరి బిగపట్టిన క్షణాన ఓ గొప్ప చరిత్ర ఆవిష్కృతమైంది. అగ్రదేశాలకు కూడా సాధ్యం కాని అద్భుతాన్ని భారత్‌ ఆవిష్కరించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పంపిన విక్రమ్‌ ల్యాండర్‌ చందమామను ముద్దాడింది. ‘నేను నా గమ్యాన్ని చేరాను.. నాతోపాటు మీరు కూడా’ అని విక్రమ్‌ తొలి సందేశాన్ని పంపింది.


ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపై కాలుమోపిన ఆ క్షణం యావత్‌ భారతదేశం సింహనాదం చేసింది. ఇస్రోకు జయజయధ్వానాలు పలికింది. అప్పటి వరకు వర్చ్యువల్ గా చూసి అభినందించిన ప్రధాని మరోసారి వ్యక్తిగతంగా ఇస్రో చైర్మన్ కు ఫోన్ చేసి మరోసారి అభినందనలు తెలిపారు. చంద్రయాన్-3 విజయవంతం కావాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారని, ఇస్రోకు మద్దతుగా నిలిచిన ప్రధానికి , ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.


Tags

Read MoreRead Less
Next Story