Chandrayaan-3: ప్రమాదాన్ని తప్పించుకున్న ప్రజ్ఞాన్‌

Chandrayaan-3:  ప్రమాదాన్ని తప్పించుకున్న ప్రజ్ఞాన్‌
ప్రజ్ఞాన్‌ రోవర్‌కు తప్పిన ప్రమాదం.... రోవర్‌ వెళ్తున్న దారిలో 4 మీటర్ల భారీ గొయ్యి.. కొత్తదారిలో రోవర్‌ ప్రయాణం...

జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి చంద్రయాన్‌-3(Chandrayaan-3) మిషన్‌లో భాగంగా ఇస్రో పంపిన ప్రజ్ఞాన్‌ రోవర్‌(Pragyan rover) కు పెను ప్రమాదం తప్పింది. రోవర్‌ వెళ్తున్న దారిలో 4 మీటర్ల వ్యాసం కలిగిన భారీ గొయ్యి ఎదురుకాగా అందులో పడిపోయే ప్రమాదం నుంచి ప్రజ్ఞాన్‌ రోవర్‌ తప్పించుకుంది. కృతిమ మేధ(AI) సాయంతో ముందుగానే ప్రమాదం గుర్తించి వేరే మార్గంలో పయనిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమం ఎక్స్‌(twitter)లో ఇస్రో(Indian Space Research Organisation ) పోస్ట్‌ చేసింది.


జాబిల్లి దక్షిణ ధ్రువం సమీపంలో అడుగుపెట్టిన చంద్రయాన్‌-3 ప్రజ్ఞాన్‌ రోవర్‌ తన పరిశోధనల్లో నిమగ్నమైంది. ఈ క్రమంలో ప్రమాదం నుంచి రోవర్‌ తప్పించుకుంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై నెమ్మదిగా కదులుతున్న ప్రజ్ఞాన్‌ రోవర్‌కు మార్గ మధ్యలో 4 మీటర్ల వ్యాసం కలిగిన బిలం(4-meter diameter crater positioned ) ఎదురైంది. ఆ గొయ్యి మూడు మీటర్ల దూరంలో(3 meters ahead ) ఉండగా ప్రజ్ఞాన్‌ రోవర్‌ గుర్తించింది. వెంటనే రోవర్‌ తన మార్గాన్ని మార్చుకుంది. ఇప్పుడు కొత్త మార్గంలో ప్రజ్ఞాన్‌ రోవర్‌ సురక్షితంగా ప్రయాణిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. అందుకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఇస్రో పోస్ట్‌ చేసింది. రోవర్‌లో ఉన్న నావిగేషన్‌ కెమెరా ఈ ఫోటోలను తీసింది.


చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా విక్రమ్‌ ల్యాండర్‌ సురక్షితంగా దిగిన సుమారు నాలుగు గంటల తర్వాత ప్రజ్ఞాన్‌ రోవర్‌ అందులోంచి బయటకు వచ్చింది. శివశక్తి పాయింట్‌ పరిసర ప్రాంతాల్లో రోవర్‌ చక్కర్లు కొడుతూ పరిశోధనలు నిర్వహిస్తోంది. రోవర్‌లో కృత్రిమ మేధ ఉంది. ఇది రాళ్లను అలవోకగా దాటేయగలదు. లేజర్లు ప్రయోగించి, చంద్రుడిపై ఉన్న పదార్థాలను విశ్లేషించగలదు. ఇంత సామర్థ్యమున్నప్పటికీ ఇది బుడిబుడి అడుగులు మాత్రమే వేస్తుంది. విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి గరిష్ఠంగా అర కిలోమీటరు మాత్రమే రోవర్‌ వెళ్లగలదు. ఎందుకంటే దీనికి సొంతంగా భూ కేంద్రంతో కమ్యూనికేషన్లు సాగించే సామర్థ్యం లేదు. ల్యాండర్‌ ద్వారానే అవి సాగాలి. అందువల్ల ప్రజ్ఞాన్‌ ఎప్పుడూ ల్యాండర్‌కు దగ్గర్లో ఉండాలి.

ప్రజ్ఞాన్‌ రోవర్‌ పొడవు 3 అడుగులు కాగా వెడల్పు 2.5 అడుగులు. రోవర్‌కు ఒక వైపున 36 అంగుళాల పొడవైన సౌరఫలకం ఉంటుంది. దీని ద్వారా 50 వాట్ల శక్తి ఉత్పత్తవుతుంది. ప్రజ్ఞాన్‌కు ఆరు చక్రాలు ఉన్నాయి. అవి వేర్వేరు విద్యుత్‌ మోటార్ల సాయంతో నడుస్తాయి. ప్రజ్ఞాన్‌ రోవర్‌ ముందు భాగంలో రెండు నావిగేషన్‌ కెమెరాలు ఉన్నాయి. ఇవి నేత్రాల్లా పనిచేస్తాయి. ప్రజ్ఞాన్‌ రోవర్‌లోని రెండు నేవిగేషన్‌ కెమెరాలు తీసే చిత్రాలను కృత్రిమ మేధ వ్యవస్థ విలీనం చేస్తుంది. తద్వారా ఎదుటి దృశ్యాలు, అవరోధాలపై సమగ్ర చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story