Chandrayaan-3: చందమామపై సల్ఫర్

జాబిల్లిపై కాలుమోపి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విక్రమ్‌ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్(Pragyan rover)లు పరిశోధనల్లో దూసుకుపోతున్నాయి. పోటాపోటీగా కొత్త విషయాలను ప్రపంచం ముందు పెడుతున్నాయి. చంద్రుని దక్షిణ ధ్రువం( south pole) ఉపరితలంపై మొట్టమొదటిసారి జరిపిన పరిశోధనల్లో సల్ఫర్ ఉనికి(sulphur on lunar surface)ని ప్రజ్ఞాన్ రోవర్ విస్పష్టంగా గుర్తించింది. సల్ఫర్‌తోపాటే మరిన్ని మూలకాలను రోవర్ గుర్తించింది.
జాబిల్లి దక్షిణధ్రువంపై కాలుమోపి అంతరిక్ష రంగంలో మరో చరిత్ర లిఖించిన మన విక్రమ్ ల్యాండర్( Vikram lander), ప్రజ్ఞాన్‌రోవర్‌లు అదే దూకుడుతో కొత్తకొత్త పరిశోధనల చేస్తున్నాయి. ఎన్నెన్నో కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. ఇటీవలే చంద్రుని ఉపరితలంలో ఉష్ణోగ్రతలను తెలిపిన రోవర్ ఇప్పుడు సల్ఫర్‌ను గుర్తించింది. ప్రజ్ఞాన్(Chandrayaan-3 rover)లోని కీలకమైన లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్-లిబ్స్ ఈ ఘనత సాధించింది. చందమామపై మట్టి, రాళ్లను అధ్యయనం చేసేందుకు..అక్కడి రసాయన, ఖనిజాలను పరిశోధించేందుకు గానూ లిబ్స్ పరికరాన్ని పంపించారు. ఊహించిన విధంగానే ఆక్సీజన్,అల్యూమినియం, కాల్షియం(Calcium), ఐరన్(Iron), క్రోమియం, టైటానియం(Titanium), మాంగనీస్, సిలికాన్‌లను ఈ సాధనం గుర్తించిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో( ISRO) పేర్కొంది. చంద్రునిపై హైడ్రోజన్ మూలకం కోసం అన్వేషణ కొనసాగుతున్నట్లు వివరించింది.
లిబ్స్‌ను బెంగళూరులోని ఇస్రో లేబోరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్(Electro-Optics System)- లియోస్ అభివృద్ధి చేసింది. ఈ సాధనం చంద్రుని ఉపరితలంపైకి తీవ్రస్థాయి లేజర్ కిరణాలను ప్రసరింపచేస్తుంది. వాటి తాకిడికి మట్టి అధికంగా వేడెక్కి ప్లాస్మా ఉత్పత్తి అవుతుంది. ఆ దశలో ఒక్కో మూలకం ఒక్కో తరంగదైర్ఘ్యంలో కాంతిని వెలువరిస్తుంది. దాన్ని విశ్లేషించడం ద్వారా సంబంధిత నమూనాలోని మూలకాలను స్పెక్ట్రోమీటర్ గుర్తిస్తుంది. విక్రమ్ ల్యాండర్‌లోన్ చాస్టే పరికరం ఇప్పటికే జాబిల్లి ఉపరితలం నుంచి కొంత దిగువకు వెళ్లి అక్కడ ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాలను గుర్తించి, ఇస్రోకు చేరవేసింది.
సౌరశక్తి సాయంతో జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను రోవర్, ల్యాండర్ శోధిస్తున్నాయి. ఇందుకోసం ఆధునిక పరికరాలను ఇస్రో (ISRO) జాబిలిపైకి పంపింది. చంద్రుడిపై ఉన్న మట్టి, నీటిపై రసాయన పరిశోధన జరపనుంది. చంద్రుడిపై వాతావరణం ఎలా ఉంది అని పరిశోధించిన సమాచారాన్ని రోవర్ భూమికి చేరవేయనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com