రెండు దశల్లో చంద్రయాన్‌-4

రెండు దశల్లో చంద్రయాన్‌-4
ఐదు మాడ్యూల్స్‌.. రెండు వాహక నౌకలు.. చంద్రయాన్‌-4 వివరాలివే..

చంద్రయాన్‌-3 చారిత్రాత్మక విజయం సాధించాక చంద్రయాన్‌-4 పేరుతో మరో మిషన్‌కు ఇస్రో సిద్ధమైంది. ఈ ప్రయోగం రెండు దశల్లో ఉంటుందని, ఇందుకోసం రెండు వాహక నౌకలను సిద్ధం చేస్తున్నట్టు ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ఇటీవల జరిగిన నేషనల్‌ సైన్స్‌ సింపోజియం కార్యక్రమంలో మాట్లాడుతూ తెలిపారు.

అయితే, ఈ ప్రయోగాన్ని గతంలో మాదిరిగా కాకుండా రెండు దశల్లో చేపట్టనుంది. చంద్రయాన్-4 చంద్రునిపై దిగడమే కాకుండా అక్కడ రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి తీసుకురానుంది. అందుకే రెండు వేర్వేరు ప్రయోగాలను నిర్వహించనుంది.

చంద్రయాన్‌-4 ఎలా పనిచేస్తుంది...?

చంద్రయాన్-3లో మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి. అవి ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్. కానీ... చంద్రయాన్-4 మిషన్‌లో ఐదు మాడ్యూల్స్‌ ఉండనున్నాయి. చంద్రుడి పైనుంచి శాంపిల్స్‌ను భూమిపైకి వదలడానికి మరో రెండు మాడ్యూల్స్‌ను అదనంగా చేర్చారు. చంద్రయాన్‌-4లో మొత్తం ఐదు స్పేస్‌క్రాఫ్ట్‌ మాడ్యూల్స్‌ ఉంటాయని చెప్పారు ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌. ప్రొపల్షన్‌, డిసెండర్‌, అసెండర్‌, ట్రాన్స్‌ఫర్‌, రీ-ఎంట్రీ అనే ఐదు మాడ్యూల్స్‌ ఉంటాయని చెప్పారాయన. మొదటి మాడ్యూల్‌ ప్రొపల్షన్‌... చంద్రయాన్‌-3లో మాదిరే భూకక్ష్య నుంచి జాబిల్లి కక్ష్యంలోకి వెళ్లే సమయంలో చంద్రయాన్‌-4కు మార్గనిర్దేశం చేస్తుంది. ఇక.. రెండోది డిసెండర్‌.. ఈ మాడ్యూల్‌... ల్యాండర్‌ చంద్రుడిపై దిగడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. మూడో మాడ్యూల్‌ అసెండర్‌... ఇది జాబిల్లిపై తిరుగుతున్న రోవర్‌ రాళ్లు, మట్టి నమూనాలను సేకరించిన తర్వాత వాటిని ల్యాండర్‌ నుంచి భూ కక్ష్యలోకి తీసుకువస్తుంది. నాలుగోది ట్రాన్స్‌ఫర్‌ మాడ్యూల్‌‌. ఇది చంద్రుడి కక్ష్య నుంచి అసెండర్‌ మాడ్యూల్‌ను భూమిపైకి పంపుతుంది. చివరిగా ఐదోది‌... రీఎంట్రీ మాడ్యూల్‌.. ఇది ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరిస్తుంది. కాప్య్సూల్‌ ఆకారంలో ఉండే ఇందులోనే నమూనాలు ఉంటాయని ఇస్రో చైర్మన్‌ తెలిపారు.

చంద్రయాన్-4 రెండు దశల ప్రయోగం వివరాలు

ఐదు మాడ్యూల్స్‌లో.. మొదటి మూడు మాడ్యూల్స్‌ను ఇస్రో భారీ అంతరిక్ష వాహక నౌక ఎల్‌వీఎం-3 ద్వారా పంపనున్నారు. ఈ ప్రయోగం చంద్రయాన్-3 తరహాలోనే ఉంటుంది. LVM-3 భారతదేశపు అత్యంత బరువైన ఉపగ్రహ ప్రయోగ వాహనం. మిగిలిన రెండు మాడ్యూల్స్‌ని పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (PSLV) తీసుకెళ్తుంది. ఒక మిషన్‌ కోసం రెండు వాహన నౌకలు వాడుతున్న మొదటి ప్రయోగం ఇదే. చంద్రయాన్-4 ఒక ఛాలెంజింగ్‌ మిషన్‌ అని అన్నారు సోమనాథ్‌. సంక్లిష్టమైన లక్ష్యాలను చేధిస్తుందని చెప్పారు. చంద్రయాన్-4 విజయవంతం అయితే.. చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను తిరిగి తీసుకువచ్చే నాలుగో దేశంగా భారతదేశం నిలుస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story