Chandrayan 3: చంద్రుడి చివరి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్‌-3

Chandrayan 3: చంద్రుడి చివరి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్‌-3
X
చంద్రయాన్‌-3 చివరి కక్ష్య తగ్గింపు సక్సెస్ ఇవాళ వేరుకానున్న ల్యాండర్‌ మాడ్యూల్‌

ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-3 వ్యోమనౌక చంద్రుడికి మరింత చేరువైంది. చంద్రయాన్‌ 3 చివరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం 153x 163 కిలోమీటర్ల కక్ష్యలో స్పేస్‌క్రాఫ్ట్‌ తిరుగుతున్నది. ఇవాళ మరో కీలక ఘట్టం జరగనుంది. ప్రయోగంలో ఎంతో కీలకమైన ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోయే ప్రక్రియను చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తున్నది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ వేరుకానున్నది. ల్యాండర్‌ మాడ్యూల్‌లో భాగమైన ల్యాండర్‌, రోవర్‌ ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి వేరుకానున్నాయి.

ఇక ల్యాండర్‌ మాడ్యూల్‌ వేరు అయిన తరువాత అతి కీలకమైన పరిణామం చోటుచేసుకోనుంది. స్పేస్‌క్రాఫ్ట్‌ వేగాన్ని తగ్గించే ప్రక్రియను ఇస్రో చేపట్టనున్నది. స్పేస్‌క్రాఫ్ట్‌ను చంద్రుడికి అతి దగ్గరి ప్రదేశమైన పెరిలూన్‌,అపోలూన్‌ కక్ష్యలోకి ప్రవేశపెడతారు.ఆ తరువాత అడ్డంగా ఉన్న స్పేస్‌క్రాఫ్ట్‌ను నిలువుగా మార్చే ప్రక్రియను చేపట్టి ఇదే కక్ష్య నుంచి ఆగస్టు 23న సాఫ్ట్‌ ల్యాండింగ్‌ను చేయనున్నారు. ఆగస్టు 1న భూమి-చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన స్పేస్‌క్రాఫ్ట్‌ ఆగస్టు 5న లూనార్‌ ఆర్బిట్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా కక్ష్య తగ్గింపు ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేసింది ఇస్రో.

మరోవైపు ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విడిపోయిన తర్వాత ల్యాండర్‌ మాడ్యూల్‌ సొంత పరిజ్ఞానంతో ముందుకు వెళ్తుందని చంద్రయాన్‌-1 ప్రాజెక్టు డైరెక్టర్‌ తెలిపారు.ల్యాండర్‌ మాడ్యూల్‌లో నాలుగు ప్రధాన థ్రస్టర్లు ఉంటాయి. విడిపోయిన అనంతరం మొదటగా అందులో ఉండే థ్రస్టర్లు, సెన్సార్లను పరీక్షించాల్సి ఉంది.ల్యాండర్‌ స్వయం ప్రతిపత్తితో పని చేస్తుంది.సాఫ్ట్‌ల్యాండింగ్‌ అయ్యేందుకు వీలుగా ల్యాండర్‌కు కమాండ్స్‌, సీక్వెన్స్‌, ఫెయిల్యూర్‌ మోడ్‌ ఐడెంటిఫికేషన్‌ తదితర అన్నింటిని అందులో ప్రొగ్రామ్‌ చేశారు. అన్ని సజావుగా జరిగితే ఆగస్టు 23న తెల్లవారుజామున సాఫ్ట్‌ ల్యాండింగ్‌ జరుగుతుంది.

Tags

Next Story