Jammu and Kashmir: జమ్ముకాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం .. వక్ఫ్ బిల్లు కాపీలను చింపేసిన ఎన్‌సి ఎమ్మెల్యేలు

నూతన వక్ఫ్ సవరణ చట్టంపై జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. నేషనల్ కాన్ఫరెన్స్ (NC) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వాయిదా తీర్మానం ఇచ్చారు. వక్ఫ్ సవరణ చట్టంపై తమ వాయిదా తీర్మానాన్ని అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీం రాథర్ తిరస్కరించారు. అయితే, ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నందున దానిపై వాయిదా తీర్మానం ద్వారా సభలో చర్చించలేమనే నియమం స్పష్టంగా చెబుతోంది అని వెల్లడించారు. దీంతో నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు స్పీకర్ పొడియం దగ్గరకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా “బన్ కరో బన్ కరో వక్ఫ్ బిల్లు కో బన్ కరో” అంటూ నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఇక, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ హఫీజ్ లోన్ మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, చట్ట పాలనను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వం ముస్లింలను లెక్కలోకి తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. మా భావోద్వేగాలను గౌరవించాలి, మీరు చట్ట పాలన, సమాఖ్యవాదం, లౌకికవాదాన్ని నిర్మొహమాటంగా ఉల్లంఘిస్తున్నారు అని ఆరోపించారు. మేము వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా మా నిరసనను వ్యక్తం చేస్తామని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com