Chennai: సొరంగ మార్గంలో నిలిచిపోయిన చెన్నై మెట్రో రైలు

Chennai:  సొరంగ మార్గంలో నిలిచిపోయిన చెన్నై మెట్రో  రైలు
X
పట్టాలపై నడుచుకుంటూ స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులు

చెన్నైలో మెట్రో ప్రయాణికులకు మంగళవారం ఉదయం ఊహించని అనుభవం ఎదురైంది. బ్లూ లైన్‌లో ప్రయాణిస్తున్న మెట్రో రైలు సాంకేతిక లోపంతో సొరంగ మార్గంలో అకస్మాత్తుగా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు రైలు దిగి, సమీపంలోని స్టేషన్‌కు పట్టాలపై నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమ్కో నగర్ డిపో మధ్య నడిచే బ్లూ లైన్ మెట్రో రైలులో ఈ ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. సెంట్రల్ మెట్రో, హైకోర్టు స్టేషన్ల మధ్య భూగర్భ మార్గంలో వెళ్తుండగా రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు కిటికీల నుంచి బయటకు చూశారు.

దాదాపు 10 నిమిషాల తర్వాత, ప్రయాణికులు రైలు దిగి సమీపంలోని హైకోర్టు స్టేషన్‌కు నడవాలని సిబ్బంది నుంచి ప్రకటన వచ్చింది. సుమారు 500 మీటర్ల దూరం వరకు ప్రయాణికులు ఒకరి వెనుక ఒకరు వరుసలో సొరంగంలోని పట్టాలపై నడుచుకుంటూ స్టేషన్‌కు చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ఈ ఘటనపై చెన్నై మెట్రో రైల్ (CMRL) స్పందించింది. సాంకేతిక లోపం లేదా విద్యుత్ అంతరాయం వల్లే ఈ సమస్య తలెత్తిందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపింది. అనంతరం సేవలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చినట్లు ఎక్స్ ద్వారా ప్రకటించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని చెన్నై మెట్రో యాజమాన్యం పేర్కొంది.

Tags

Next Story