Virginity Tests: కన్యత్వ పరీక్ష గౌరవాన్ని ఉల్లంఘించడమే

భార్యకు కన్యత్వ నిర్ధారణ పరీక్ష చేయాలని డిమాండ్ చేయడం మహిళల గౌరవ హక్కును ఉల్లంఘించడమే కాక, రాజ్యాంగ విరుద్ధమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది. భార్యకు కన్యత్వ పరీక్ష చేయాలంటూ భర్త చేసిన డిమాండ్‌ను కొట్టివేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నట్టు జస్టిస్ అరవింద్‌కుమార్ వర్మ తీర్పు చెప్పారు. కేసు వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లో ఒక జంటకు 2023 ఏప్రిల్ 30న పెండ్లయ్యింది. అయితే తన భర్త నపుంసకుడని, సంసారానికి పనికిరాడని పేర్కొంటూ, తనకు నెలకు రూ.20 వేల భరణంతో విడాకులు ఇప్పించాలంటూ రాయ్‌గర్ జిల్లా కోర్టులో భార్య కేసు వేసింది. అయితే తన భార్య ఆమె బావతో వివాహేతర సంబంధం పెట్టుకుందని, విడాకుల కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నదని భర్త వాదించారు.
ఆమె ఆరోపణలు నిజం కాదని రుజువు చేసేందుకు ఆమెకు కన్యత్వ పరీక్షను చేయాలని డిమాండ్ చేశాడు. అతడి వాదనను కోర్టు కొట్టివేసింది. దీనిపై అతను హైకోర్టును ఆశ్రయించగా, దీనిపై స్పందించిన హైకోర్టు తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని రుజువు చేయదల్చుకునేందుకు భర్త.. వైద్య పరీక్షలు కాని, ఇతర అధారాలు కాని చూపాలని కోరుతూ, లోపాలను కప్పిపుచ్చుకోవడానికి శీలంపై అనుమానాలు వద్దని పేర్కొంది.
ఛత్తీస్ గఢ్ లోని రాయ్ గఢ్ జిల్లాకు చెందిన ఈ జంటకు 2023 ఏప్రిల్ 30న వివాహం జరిగింది. ఆమె తన భర్తకు వ్యతిరేకంగా జూలై 2, 2024న రూ. 20,000 భరణం డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. భర్త నపుంసకుడు అని పిటిషన్‌లో ఆరోపించారు. అయితే తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని భర్త పిటిషన్ దాఖలు చేశాడు. ఇరువురి వాదనలు విన్న కోర్టు ఈ తీర్పునిచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com