Chhattisgarh: ఓ సామాన్యుడి విజయ గాధ

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది . 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో 54 చోట్ల విజయం సాధించిన భాజపా అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఓ సామాన్యుడి విజయం... రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. కుమారుడి హత్యతో కడుపుమండి ఎన్నికల బరిలో దిగిన ఓ దినసరి కూలీ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిపై విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. ఈ విజయం ఛత్తీస్‌గఢ్‌లో పెను సంచలనం సృష్టించింది.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈశ్వర్ సాహు ఓ దినసరి కూలి. సాహు పనికి వెళ్తేనే వాళ్లింట్లో పూట గడిచేది. ఈశ్వర్‌సాహు కుమారుడు ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన అల్లర్లలో కన్నుమూశాడు. ఏప్రిల్ 2023లో సాజా అసెంబ్లీ నియోజకవర్గంలోని బీరాన్‌పూర్ గ్రామంలో మతపరమైన అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు చనిపోయారు. ఇందులో ఈశ్వర్ సాహు కుమారుడు భువనేశ్వర్ సాహు కూడా ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తన కుమారుడు మృతి చెందడాన్ని ఈశ్వర్ సాహు జీర్ణించుకోలేకపోయారు. కుమారుడి హత్యతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈశ్వర్ ఆగ్రహంతో రగిలిపోయాడు. ఈ కేసులో దోషులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని భాజపా కూడా ఆరోపించింది.
ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చాయి. కుమారుడి హత్యతో రగిలిపోతున్న ఈశ్వర్ సాహును భారతీయ జనతా పార్టీ సాజా అసెంబ్లీ స్థానం నుంచి.. బరిలోకి దించింది. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ దిగ్గజం, ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర చౌబే సాజా బరిలోకి దిగారు. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర చౌబేపై ఈశ్వర్ సాహు 5 వేల 527 ఓట్ల మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఓ సామాన్యుడు ఎమ్మెల్యేగా ఎన్నికవడంపై ప్రజలు ఇది కదా విజయమంటే అని కొనియాడుతున్నారు.
90 స్థానాలు ఉన్న అసెంబ్లీలో బీజేపీ 54 నియోజకవర్గాల్లో విజయఢంకా మోగించగా, కాంగ్రెస్ 35 స్థానాల్లో గెలిచింది. 2018 ఎన్నికల్లో 68 సీట్లతో హస్తం పార్టీ అధికారం చేపట్టగా.. బీజేపీ కేవలం 15 సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల ఫలితాలు కమలం పార్టీకి గట్టి దెబ్బే అని చెప్పాలి. బీజేపీ హవాలో రాష్ట్రానికి చెందిన 9 మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ సర్కారులోని డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ డియోకూడా ఓటమి పాలయ్యారు. హోంమంత్రి తమ్రద్వాజ్ సాహూ కూడా ఓడిపోయారు. నిజానికి ఈ ఇద్దరు లీడర్లు.. 2018 ఎన్నికల్లో సీఎం అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. కానీ తాజా ఎన్నికల్లో మాత్రం డిప్యూటీ సీఎంకు ఓటర్లు జలక్ ఇచ్చారు. సింగ్ డియో కేవలం 94 ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com