AYODHYA: రాములోరి వేడుకకు తరలివస్తున్న అతిరథ మహారథులు

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి 8వేలమందిని ఆహ్వానించగా... అందులో 506మంది లిస్ట్-ఏలో ఉన్నారు. ఇందులో ప్రముఖ రాజకీయ నేతలతోపాటు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, అగ్రశ్రేణి నటీనటులు, క్రీడాకారులు, దౌత్యవేత్తలు, న్యాయమూర్తులు, పూజారులు ఉన్నారు. అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ట ప్రారంభ మహోత్సవానికి ముహూర్తం సమీపిస్తున్న వేళ...ఆ క్రతువుకు హాజరయ్యే ప్రముఖుల జాబితా బయటకు వచ్చింది. మెుత్తం 8వేల మందిని ఆహ్వానించగా...అందులో 506మంది జాబితా-Aలో ఉన్నారు. వారిలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, సచిన్ టెండూల్కర్ తదితరులు ఉన్నారు. దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి సూపర్‌స్టార్ రజినీకాంత్, ప్రభాస్, అల్లుఅర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మోహన్‌లాల్ ఉన్నారు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, అజయ్ దేవ్‌గన్, కంగనారనౌత్, మాధురిదీక్షిత్, హేమమాలినీ, సన్నీ దియోల్‌లు ఉన్నారు. సరోద్ విద్వాంసుడు అంజద్ అలీఖాన్, గేయ రచయిత, కవి మనోజ్ ముంతాషిర్, ఆయన సతీమణి ప్రశూన్ జోషి, ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. గాయకులు శ్రేయాగోషల్, కైలాస్ ఖేర్, శంకర్ మహదేవన్, సోనూనిగమ్, అనురాధ పాడ్వాల్ ఆలయ ప్రారంభోత్సవానికి ఆలయ ట్రస్టు ఆహ్వానించింది. రామాయణ ధారావాహికలో రాముడు, సీత పాత్రలు పోషించిన అరుణ్ గోవిల్, దీపిక కూడా ఆహ్వానాలు అందుకున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్‌సహా పలువురు న్యాయమూర్తులు ఆహ్వానిత జాబితాలో ఉన్నారు. రామమందిర నిర్మాణం కోసం పోరాడిన బీజేపీ దిగ్గజ నేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కల్యాణ్ సింగ్ కూడా జాబితా-ఏలో ఉన్నారు. కేంద్ర మాజీమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, మాజీ ప్రధాని వాజ్‌పేయి అల్లుడు రంజన్ భట్టాచార్య, మాజీ రాష్ట్రపతులు రామ్‌నాథ్ కోవింద్, ప్రతిభాపాటిల్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల నుంచి ఇస్రో ఛైరపర్సన్ సోమ్‌నాథ్, మాజీ ఛైర్‌పర్సన్ కె.శివన్, ఆ సంస్థ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్, డీఆర్డీవో శాస్త్రవేత్త సుదర్శన్ శర్మ, వందేభారత్ రైలు రూపకర్త సుదాన్షుమణి, నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి ఉన్నారు.
క్రీడారంగం నుంచి కపిల్ దేవ్, ధోని, సునీల్ గవాస్కర్, కోహ్లీ, ద్రవిడ్, గంగూలీ, రోహిత్ శర్మ, పీటీ ఉషా, కరణం మల్లీశ్వరీ, విశ్వనాథ్ ఆనంద్, సైనా నెహ్వాల్, పీవీ సింధు, మిథాలీరాజ్ తదితరులు ఉన్నారు. పారిశ్రామిక రంగం నుంచి రిలయెన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం, రతన్ టాటా, టాటా సన్స్ ఛైర్‌పర్సన్ ఎన్.చంద్రశేఖరన్, హిందూజా కుటుంబం, అజీమ్ ప్రేమ్‌జీ, జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ జీఎంఆర్ రావు ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్‌పర్సన్ కుమారమంగళం బిర్లా, ఆనంద్ మహీంద్ర, ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకులు నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి, నందన్ నిలేకని, దిల్లీ మెట్రోమెన్ శ్రీధరన్ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. వీరందరూ ఒక్కొక్కరుగా ఈ పుణ్య ఘట్టాన్ని తిలకించేందుకు తరలి వస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com