Alzheimer’s surgery : చైనాలో అల్జీమర్స్ సర్జరీపై నిషేధం

అల్జీమర్స్ సర్జరీ చికిత్సపై ఇటీవల చైనాలో నిషేధం విధించారు. అల్జీమర్స్ అనేది నాడీ క్షీణత వ్యాధి. ఇది క్రమంగా జ్ఞాపకశక్తిని, ఆలోచన, అభ్యసన సామర్థ్యాన్ని, నిర్వహణ నైపుణ్యాలను కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ వ్యాధికి చికిత్స లేదు. కొన్ని రకాల మందులతో వ్యాధి లక్షణాలను అదుపులో ఉంచుకోవచ్చు.
కానీ చైనాలో అల్జీమర్స్ వ్యాధికి ఓ సర్జరీ విధానం (ఎల్వీఏ సర్జరీ) ప్రాచుర్యం పొందింది. అన్ని రాష్ట్రాల్లోని ప్రైవేటు ఆసుపత్రులు విరివిగా ఈ విధానంలో చికిత్స అందించడం ప్రారంభించాయి. అయితే తాజాగా, దీనిపై జాతీయ వైద్య విభాగం దృష్టి పెట్టి ఎల్వీఏ సర్జరీపై నిషేధం విధించింది. ఈ విధానం సురక్షితం, సమర్థతకు సంబంధించి నిర్దిష్టమైన ఆధారాలు లేవని పేర్కొంది. జాతీయ వైద్య విభాగం నిషేధం విధించడంతో నాలుగేళ్లుగా దాదాపు 400 ఆసుపత్రుల్లో చేపట్టిన శస్త్ర చికిత్సా విధానం నిలిచిపోయినట్లు అయింది.
ఆల్జీమర్స్‌కు ఝిజియాంగ్ ప్రావిన్సులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చెందిన ఓ మైక్రోసర్జరీ నిపుణుడు తొలిసారి లింఫాటిక్ వేనస్ అనస్టోమోసిన్ (ఎల్వీఏ) విధానంలో చికిత్స చేశాడు. అనంతరం ఏడాది కాలంలోనే అది ప్రాచుర్యం పొందింది. ఈ నాలుగేళ్లలో అన్ని రాష్ట్రాల్లో దాదాపు 382 ఆసుపత్రుల్లో ఈ చికిత్స చేయడం ప్రారంభించారు.
60-80 శాతం రోగుల్లో ఇది సమర్థవంతంగా పనిచేస్తోందని కొందరు వైద్యులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వైద్యుల అభిప్రాయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై కొందరు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం దృష్టి పెట్టింది.
ఎల్వీఏ సర్జరీ విధానాన్ని కొన్ని ఆసుపత్రులు చేపడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ పేర్కొంది. దీని భద్రత, సమర్థతకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పింది. తక్షణం ఈ చికిత్సను ఆపేలా చర్యలు తీసుకోవాలని స్థానిక వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com