China: సరిహద్దుల్లో చైనా సొరంగాలు

భారత సరిహద్దుల్లో చైనా(China) దుందుడుకు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్ సహా అక్సాయ్ చిన్( Aksai Chin) ప్రాంతం తమవేనంటూ డ్రాగన్ ఇటీవల మ్యాప్‌ను విడుదల చేసింది. అయితే తాజాగా వాస్తవాధీన రేఖకు తూర్పు ప్రాంతం అక్సాయ్ చిన్‌లో సొరంగాలు తవ్వుతున్న చిత్రాలు(Satellite images) బయటకు వచ్చాయి. ఉత్తర లద్దాఖ్(Northern Ladakh)లోని దేప్సాంగ్( Depsang Plains)కు తూర్పున ఆరు కిలోమీటర్ల దూరంలో సొరంగాలు, బంకర్లు,రహదారులను చైనా నిర్మిస్తున్నట్టు వెల్లడైంది. దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు బయటికి వచ్చాయి. అక్సాయ్ చిన్ ప్రాంతంలోని కొండల్లో కనీసం 11 చోట్ల పెద్ద కన్నాలు( at least 11 portals) తవ్వుతున్నట్లు అంతర్జాతీయ నిపుణులు తేల్చారు. ఈ ప్రాంతంలో కొన్ని నెలలుగా పెద్దఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నట్లు( construction activity) ఆ చిత్రాల ద్వారా గుర్తించారు.
అక్సాయ్ చిన్‌లో వైమానిక, క్షిపణి దాడులు జరిగినా తమ సైన్యానికి ఎటువంటి నష్టం కలగని విధంగా చైనా పటిష్ఠమైన కాంక్రీటు నిర్మాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ భారత్ వైమానిక దాడులకు దిగితే దీటుగా ఎదుర్కొనేందుకే పీపుల్ లిబరేషన్ ఆర్మీ PLA అక్కడ ఈ వ్యూహాలు రచిస్తున్నట్టు చెబుతున్నారు.ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉండటం భారత్‌కు కొంత ఆందోళన కలిగించే అంశమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అక్సాయ్ చిన్ ప్రాంతం భారత వైమానిక దళానికి సానుకూలంగా ఉందని, ఈ ప్రాంతంపై భారత బలగాలకు ఉన్న పట్టును దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతోనే చైనా బలగాలు భూగర్భ నిర్మాణాలు చేపడుతున్నాయని ఉపగ్రహ చిత్రాల విశ్లేషణా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత భారత సైన్యం ఆ ప్రాంతంలో ఆయుధ సంపత్తిని, దాడులను తిప్పికొట్టే సమర్థతను పెంచుకుంటోందని.. ఈ క్రమంలోనే చైనా కవ్వింపులకు పాల్పడుతోందని వివరిస్తున్నారు.
గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్ కూడా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. లద్దాఖ్ రీజియన్‌లో రహదారులు, సొరంగాల నిర్మాణాలను విస్తృతంగా చేపట్టింది. ఎల్‌ఏసీ వద్ద సున్నిత ప్రాంతమైన దౌలత్ బేగ్ ఓల్డీ పోస్ట్‌కు లేహ్‌కు మధ్య రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసింది. దీంతో అక్కడికి సైనికులు చేరుకోవడానికి గతంలో రెండ్రోజులు పట్టే సమయం కాస్తా ఇప్పుడు ఆరు గంటలకు తగ్గింది. కాగా, భారత్‌లోని భూభాగాలు తమవేనంటూ చైనా మ్యాప్ విడుదల చేయడాన్ని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కొట్టిపారేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com