నెటిజన్ల చేతికి చిక్కిన చిత్రమ్మ .. సోషల్ మీడియాలో ట్రోల్స్

నెటిజన్ల చేతికి చిక్కిన చిత్రమ్మ .. సోషల్ మీడియాలో ట్రోల్స్
సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ఎవరైనా ఏదైనా రాసుకోవచ్చు. వారికి ఆ హక్కు ఉంది. అయితే అది ఒక్కోసారి కొందరి మనోభావాలు దెబ్బతీస్తుంది.

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ఎవరైనా ఏదైనా రాసుకోవచ్చు. వారికి ఆ హక్కు ఉంది. అయితే అది ఒక్కోసారి కొందరి మనోభావాలు దెబ్బతీస్తుంది. అందుకే తమ మనసులోని భావాలను తమలోనే ఉంచుకుంటారు చాలా మంది ఈ ట్రోల్స్ బారిన పడలేక.. పాపం వివాదాలకు దూరంగా ఉండే ప్రముఖ గాయనీమణి చిత్ర ఈసారి వారి బారి నుంచి తప్పించుకోలేకపోయింది. ఆమె పెట్టిన పోస్ట్ కు పాజిటివ్ గా స్పందించిన వారు కొందరైతే, మరికొందరు ట్రోల్స్ చేస్తూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. అందరికీ అన్నీ నచ్చాలని లేకపోయినా సెలబ్రెటీలు ఆచి తూచి మాట్లాడకపోతే వారి ఇష్టం వచ్చినట్లు ఆడేసుకుంటారు. ఇంతకీ ఆమె పోస్ట్ పెట్టిన సారాంశం ఏమంటే..

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ 'శ్రీరామ, జయ రామ, జయ జయ రామ' మంత్రాన్ని జపించాలని చిత్ర కోరారు. జనవరి 22న అయోధ్యలో జరిగే రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రజలను రాముడి కీర్తనలు ఆలపించాలంటూ వీడియో సందేశం పంపినందుకు జాతీయ అవార్డు గ్రహీత గాయని కెఎస్ చిత్ర సోషల్ మీడియా దాడికి గురైంది.

ప్రతి ఒక్కరూ పవిత్రోత్సవం జరిగేటప్పుడు మధ్యాహ్నం 12.20 గంటలకు 'శ్రీరామ, జయ రామ, జయ జయ రామ' మంత్రాన్ని జపించాలని ఆమె కోరారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అదే రోజు సాయంత్రం ప్రజలు తమ ఇళ్లలో ఐదు వత్తుల దీపాలను వెలిగించాలని చెప్పారు. 60 ఏళ్ల గాయని, సర్వేశ్వరుని ఆశీస్సులు అందరిపైనా కురవాలని కోరుకుంటూ "లోకా సమస్తా సుఖినో భవంతు" అనే సంస్కృత శ్లోకాన్ని పఠిస్తూ తన సందేశాన్ని ముగించారు.

అయితే, గాయని నుండి వచ్చిన వీడియో సందేశం నెటిజన్లలోని ఒక వర్గానికి ఏ మాత్రం నచ్చలేదు. విమర్శించడమే పనిగా పెట్టుకునే వారు ఆమె చర్యను తప్పుపట్టారు. ఇలాంటి సందేశం ఇవ్వడం ద్వారా ఆమె అధికార పక్షానికి జై కొడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే చిత్రకు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించే హక్కు, స్వేచ్ఛ ఉందని చెబుతూ అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆమెకు మద్దతునిచ్చారు.

చిత్రకు మద్దతు పలికిన గాయకుడు జి వేణుగోపాల్, ఆన్‌లైన్ వ్యాఖ్యలు ఆమెను అవమానించాయని, ఆమె మనసును బాధించాయని అన్నారు. ఫేస్‌బుక్ పోస్ట్‌లో, ఆమె చేసిన వ్యాఖ్యలపై విమర్శకులకు ఏమైనా అభిప్రాయభేదాలు ఉంటే క్షమించాలని ఆయన అభ్యర్థించారు.

ఇటీవల త్రిసూర్‌లో బిజెపి నిర్వహించిన మహిళా సాధికారత కార్యక్రమంలో నటి శోభన ప్రధాని నరేంద్ర మోడీతో వేదికను పంచుకున్నందుకు ఒక వర్గం ప్రజలు తీవ్రంగా విమర్శించిన కొద్దిరోజులకే గాయని చిత్రపై ఈ విధమైన సైబర్ దాడి జరిగింది. కేరళకు చెందిన 'వానంబాడి' (నైటింగేల్)గా ప్రసిద్ధి చెందిన చిత్ర అనేక భాషలలో వేలాది పాటలు పాడి సంగీత ప్రియుల మనసులను దోచుకున్నారు. అనేక జాతీయ, రాష్ట్ర అవార్డులు ఆమె గాత్రానికి వన్నె తెచ్చాయి.

Tags

Next Story