lectoral Bonds: నిధులిస్తోంది ఎవరో తెలుసుకునే హక్కు పౌరులకు లేదు

lectoral Bonds: నిధులిస్తోంది ఎవరో తెలుసుకునే హక్కు పౌరులకు లేదు
X
సుప్రీం ముందు కేంద్రం వాదన...

రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే హక్కు పౌరులకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. సహేతుక పరిమితులు లేకుండా ఏదైనా.. ప్రతిదీ తెలుసుకునే సాధారణ హక్కు ఉండరాదని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఒక స్టేట్‌మెంట్‌ సమర్పించారు.రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు రూపొందించిన ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థపై సవాల్‌పై విచారణకు ముందు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టులో తన సమాధానాన్ని దాఖలు చేశారు. ఏ రాజకీయ పార్టీ ద్వారా వచ్చిన విరాళాల గురించి సమాచారం పొందడం పౌరుల ప్రాథమిక హక్కు కాదని ఆయన అన్నారు. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. ఈ విషయమై నేటి నుంచి విచారణను ప్రారంభించనుంది. ఈ అంశంపై తన అభిప్రాయాన్ని తెలియజేయాలని అటార్నీ జనరల్‌ను సుప్రీంకోర్టు కోరగా, ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు.

ఎలక్టోరల్‌ బాండ్ల స్కీంను అందులో ఆయన గట్టిగా సమర్థించారు. స్వచ్ఛమైన తెల్లధనమే పార్టీలకు రాజకీయ విరాళంగా అందుతోందని తెలిపారు. రాజ్యాంగంలోని 19 (1ఏ) అధికరణ ప్రకారం రాజకీయ విరాళాలు ఇస్తున్నది ఎవరన్న సమాచారం తెలుసుకునే హక్కు పౌరులకు లేదు. ఈ బాండ్ల స్కీం ప్రకారం.. దాత పేరును రహస్యంగా ఉంచాలి. అన్ని పన్నులకు లోబడిన తెల్ల ధనం మాత్రమే విరాళంగా ఇస్తారు. ప్రస్తుత హక్కులను ఉల్లంఘించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నప్పుడు మాత్రమే రాజ్యాంగ కోర్టు సమీక్ష జరపాలి. అంతేతప్ప ప్రభుత్వ నిర్ణయంలో ఫలానా హక్కు లేదని.. తాము ఆశించిన ఫలానా అంశం చేర్చి ఉండాల్సిందని అంటే దానిపై సమీక్ష చేయరాదు. రాజకీయ పార్టీలకు విరాళం అనే అంశానికి ప్రజాస్వామిక ప్రాధాన్యం ఉంది. పలుకుబడి, ప్రభావాలకు అతీతంగా పాలనలో జవాబుదారీతనం ఉండాలన్న డిమాండ్‌ వచ్చిందని.. రాజ్యాంగంలో చట్టబద్ధమైన నిబంధన లేవంటూ.. ఇలాంటి అంశాల్లో ఆదేశాలు జారీచేసే దిశగా కోర్టులు ముందుకెళ్లరాదు’ అని పేర్కొన్నారు. న్యాయసమీక్ష అధికారం.. ప్రభుత్వ విధానాలను పరిశీలించి అంతకంటే ఉత్తమమైనవి సూచించడానికి కాదని అభిప్రాయపడ్డారు. గతంలో రాజకీయ పార్టీలకు నగదు రూపంలో విరాళాలు అందేవి. ఇందులో పారదర్శకతను తీసుకొస్తూ 2018 జనవరి 2న కేంద్రం అమల్లోకి తెచ్చిన ఎలక్టొరల్‌ బాండ్ల స్కీంను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పార్టీలు, వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని 5 గురు సభ్యులా ధర్మాసనం దీనిపై నేటినుంచి విచారణ జరపనుంది.

Tags

Next Story