CJI: తదుపరి సీజేఐగా జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌

CJI: తదుపరి సీజేఐగా జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌
X
సిఫారసు చేసిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీ.ఆర్. గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆయన పేరును ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా కేంద్ర న్యాయ శాఖకు సిఫార్సు చేశారు.

సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే 13వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత రోజు మే 14న నూతన సీజేఐగా జస్టిస్ బి.ఆర్. గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ గవాయ్ నవంబర్ నెలలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన ఆరు నెలల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.

కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి చేపడుతున్న రెండో దళిత జడ్జి జస్టిస్ గవాయ్. ఆయన మహారాష్ట్రలోని అమరావతికి చెందినవారు. మహారాష్ట్ర హైకోర్టు జడ్జిగా పనిచేసిన రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. బాంబే హైకోర్టులో 1987 నుంచి 1990 మధ్య కాలంలో న్యాయవాదిగా విధులు నిర్వర్తించారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ ప్లీడరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2003లో హైకోర్టులో అదనపు జడ్జి బాధ్యతలను స్వీకరించారు. 2005లో పూర్తిస్థాయి జడ్జిగా నియమితులయ్యారు. 2019లో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

జస్టిస్ గవాయ్ దేశంలో రెండవ దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతారు. అంతకుముందు, జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. జస్టిస్ బాలకృష్ణన్ 2007 సంవత్సరంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, జస్టిస్ గవాయ్ అనేక మైలురాయి తీర్పులలో పాల్గొన్నారు. వాటిలో మోదీ ప్రభుత్వం 2016లో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించడంతోపాటు ఎన్నికల బాండ్ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడం జరిగింది.

Tags

Next Story